Modern Farming: స్వేచ్ఛ బ్యూరో: రైతు సంక్షేమం – ఆధునిక వ్యవసాయ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం అని వ్యవసాయశాఖ సంచాలకుడు బి.గోపి స్పష్టం చేశారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4 నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన “రైతు వారం” కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయన్నారు.వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ శాఖల అయినా ఉద్యానవన పట్టు పరిశ్రమ , విద్యుత్, మార్కెటింగ్, సహకార, పశుసంవర్ధక ,మత్స్య శాఖ, పౌర సరఫరా నీటిపారుదల సమన్వయంతో రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, శాస్త్రీయ వ్యవసాయం, మార్కెటింగ్, యాంత్రీకరణ, పశుసంవర్ధక , నీటిపారుదల అంశాలపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించినట్లు వెల్లడించారు.
రైతువారం కార్యక్రమం నేల ఆరోగ్యం – శాస్త్రీయ సాగుకు తొలి అడుగు పడిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన రైతు వారోత్సవాల్లో 222762 రైతులు,5850 అధికారులు,8157 ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారని, 14,565 మట్టి నమూనాలను సేకరించి, 20,734 మట్టి విశ్లేషణ పత్రాలను రైతులకు అందజేశామన్నారు. నానో ఎరువుల వినియోగం, ప్రకృతి వ్యవసాయం, సన్న వరి సాగు వంటి అంశాలపై రైతులకు శాస్త్రీయ అవగాహన కల్పించడం జరిగిందన్నారు.
Also read: వివాదంలో రిజ్వాన్…స్టేడియాల్లో అల్లాకు ప్రార్థనలు చేయొద్దంటూ ప్రకటన !
ప్రత్యామ్నాయ పంటల సాగు, ముఖ్యంగా ఆయిల్ పామ్, నూనె గింజలు, పప్పు ధాన్యాల సాగుపై రైతులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని, బిందు సేద్యం, నీటి పొదుపు సాంకేతికతల వినియోగంపై ప్రత్యేక అవగాహన కల్పించడం జరిగిందన్నారు. రైతులకు పంట రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డులు, సహకార సంఘాల సేవలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. గోదాముల నిల్వ సదుపాయాలు, కనీస మద్దతు ధర , మార్కెటింగ్ అవకాశాలపై రైతులకు వివరించినట్లు తెలిపారు. ఆధునిక వ్యవసాయ యంత్రాలు, డ్రోన్ సాంకేతికత ప్రదర్శనలు , 1,344 వ్యవసాయ యంత్రాలను ప్రదర్శన, 370 మంది రైతుల నుంచి యంత్రాల కోసం దరఖాస్తులు స్వీకరణ, పీఎం కుసుమ్ పథకం కింద సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, సబ్సిడీలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు.
పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని,రాష్ట్రవ్యాప్తంగా 593 కృత్రిమ గర్భధారణ క్యాంపులు నిర్వహించి, 35,336 పశువులకు వైద్య పరీక్షలు చేయడం జరిగిందని, 2,654 మంది రైతులకు పచ్చిగడ్డి విత్తనాలు పంపిణీ,మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపల ఉత్పత్తి పెంపు, చెరువుల నిర్వహణపై రైతులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. వేసవిలో పశువుల సంరక్షణ, పచ్చిగడ్డి సాగు, సమగ్ర నీటి వినియోగం, నీటి లభ్యత ఆధారంగా పంటల ప్రణాళికపై వివరించామని, నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో కాలువల మరమ్మత్తులు, చెరువుల పూడికతీత పనులు వేగవంతం చేయడంపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. చెరువుల నల్లమట్టి వినియోగం వల్ల నేల సారవంతం పెరుగుతుందని వివరించారు. ఈ రైతు వారోత్సవ కార్యక్రమాలు రైతులకు శాస్త్రీయ అవగాహన ఆధునిక సాంకేతిక ఆర్థిక భరోసా అందిస్తూ వ్యవసాయ అభివృద్ధికి దోహదపడుతాయని,రైతు సంక్షేమం తో తెలంగాణ వ్యవసాయ రంగం మరింత బలపడుతుందని విశ్వసిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read: అంతా డూప్లికేట్.. ప్రీమియర్ లిక్కర్‌లో చీప్ లిక్కర్ మిక్సింగ్..!