Sama Ram Mohan Reddy: బీఆర్‌ఎస్ నాయకులపై టీపీసీసీ మీడియా, కమ్యూనికేషన్ల చైర్మన్ సామ రామ్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ ఫోన్ల కొనుగోలులో అవినీతికి పాల్పడిందంటూ బీఆర్‌ఎస్ చేస్తున్న ఆరోపణలను ఆయన ‘అడ్డమైన కాకి లెక్కలు’గా అభివర్ణించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వివరాలను పంచుకున్నారు. అబద్ధాలు చెప్పడం.. అడ్డంగా దొరికిపోవడం బేకారు రాష్ట్ర సమితి (BRS) నాయకులకు అలవాటైపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. నిజాలతో నిగ్గుతేల్చేందుకు తమ ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వం కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్ల ధరల విషయంలో బీఆర్‌ఎస్ చేస్తున్న ప్రచారాన్ని సామ రామ్ మోహన్ రెడ్డి గణాంకాలతో సహా ఖండించారు. మార్కెట్ ధర కంటే తక్కువకే ప్రభుత్వం A06(4/64GB) ఫోన్లను కొనుగోలు చేసిందని ఆయన వివరించారు. కేవలం ఫోన్ మాత్రమే కాకుండా.. దానితో పాటు అదనంగా ఎండిఎం సాఫ్ట్‌వేర్.. అడాప్టర్.. డేటా కేబుల్.. స్క్రీన్ గార్డ్.. డస్ట్ ప్రూఫ్ పౌచ్.. మొబైల్ క్యారీ కేసు వంటి వస్తువులన్నింటినీ కలిపి ప్రభుత్వం సమీకరించిందని తెలిపారు.
మొత్తం 38,130 ఫోన్లను ఒక్కొక్కటి రూ.11,650 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేసిందని సామ వెల్లడించారు. వీటన్నింటికీ కలిపి మొత్తం రూ.44,42,14,500 (44 కోట్ల 42 లక్షల 14 వేల 500 రూపాయలు) మాత్రమే వెచ్చించినట్లు ఆయన స్పష్టమైన లెక్కలను బయటపెట్టారు. అదనపు పరికరాలు.. సాఫ్ట్‌వేర్ ఖర్చులను కలపకుండా కేవలం ఫోన్ ధరతో పోల్చి అవినీతి జరిగిందని ఆరోపించడం బీఆర్‌ఎస్ నేతల అజ్ఞానానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు.
ప్రజలను తప్పుదోవ పట్టించే ఫేక్ ప్రచారాలను ఇప్పటికైనా మానుకోవాలని సామ రామ్ మోహన్ రెడ్డి హితవు పలికారు. అడ్డంగా దొరికిపోయిన బీఆర్‌ఎస్ నేతలు తమ తప్పును ఒప్పుకుని ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. “గుడ్డి లెక్కలు.. అబద్ధాలు వద్దు.. నిజాలు నిజాయితీ ముద్దు” అంటూ ఆయన బీఆర్‌ఎస్ నాయకులకు చురకలు అంటించారు.