Saraswati Pushkaralu: తెలంగాణలో గురువారం నుంచి మొదలు కానున్న సరస్వతీ నది పుష్కరాలకు అంతా రెడీ అయ్యింది. దక్షిణ భారత్‌లోని కాళేశ్వరంలో ఈ పుష్కరాలు జరుగుతుండడంతో పక్కాగా అన్నిరకాల ఏర్పాట్లు చేశారు అధికారులు. మే 15 (గురువారం) నుంచి 26 వరకు ఈ పుష్కరాలు జరగనున్నాయి. పుష్కర స్నానం, అమ్మవారిని దర్శించుకోవడానికి రోజుకు లక్ష మంది భక్తులు వస్తారని భావిస్తున్నారు అధికారులు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో సరస్వతి నదీ పుష్కరాలు గురువారం ప్రారంభం కానున్నాయి. మే 15 నుంచి జరిగే పుష్కరాలకు అంతా సిద్ధం చేశారు. కాళేశ్వరం వచ్చే భక్తులకు మౌలిక వసతులు, తెలంగాణలోని వివిధ జిల్లాలు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. రూ.35 కోట్లతో శాశ్వత నిర్మాణాలను చేపట్టింది.
పుష్కరాల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతున్నారు. దక్షిణ భారత్‌లో కేవలం కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణతోపాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని అంచనా వేస్తున్నారు. రోజుకు ఎలాగ లేదన్నా లక్షకు పైగానే భక్తులు రావచ్చని భావిస్తున్నారు.
భక్తులు సరిపడా ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం. పుష్కరాలకు వచ్చే భక్తులు హెలికాప్టర్‌లో విహరించేందుకు ఏర్పాటు చేసింది. నది ఒడ్డున 10 అడుగుల సరస్వతి విగ్రహం ప్రధాన హైలైట్ గా నిలవనుంది. సరస్వతి పుష్కరాలను దేశంలో నాలుగు చోట్ల చేపడుతున్నారు. గురువారం నుంచి ఈ మహాక్రతువు ప్రారంభం కానుంది.
ALSO READ: ఆ రూల్ ఫేక్.. రాజీవ్ పథకంపై క్లారిటీ ఇదే
ఉత్తరాదిలో నాలుగు ప్రాంతాలుండగా దక్షిణాదిలో కాళేశ్వరం ఒక్కటే మాత్రమే ఉంది. నది పుట్టిన చోటు ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, ఉత్తర్‌ప్రదేశ్ లోని గంగ, యమున, సరస్వతీ నదుల సంగమం ప్రయాగ్‌రాజ్, గుజరాత్‌లోని సోమనాథ్, రాజస్థాన్‌లోని పుష్కర్‌లో జరగనున్నాయి.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై రెండు శివ లింగాలు (కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి)ఉన్న పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో మాత్రమే ఉంది. రెండు లింగాలకు నిత్యం అభిషేకించిన నీరు.. గోదావరి, ప్రాణహిత నదుల సంగమంలో కలుస్తుంది. దీంతో ఆ ప్రాంతాన్ని సరస్వతి నదిని అంతర్వాహినిగా పిలుస్తారు. సరస్వతి పుష్కరాలు-2025 పేరిట ప్రత్యేక యాప్‌ను తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి కాలేశ్వరం వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతోంది. వరంగల్‌తోపాటు హైదరాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు రెడీ చేసింది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు తెలిపారు. స్పెషల్ బస్సులు, ఛార్జీలను ఖరారు చేశారు. వరంగల్ నుంచి 790 బస్సులు సిద్ధం చేశారు.
సరస్వతి పుష్కరాల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా బస్సులు నడుపుతామని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు వెయ్యికి పైగా బస్సులు నడపనున్నారు. డీలక్స్, సెమీ డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ, ఎక్స్‌ప్రెస్ సర్వీసులున్నాయి. నార్మల్ ఛార్జీల కంటే దాదాపు 1.5 శాతం ఛార్జీలు పెంచినట్టు అధికారులు తెలిపారు.