Secunderabad Railway Station: మీరు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళుతున్నారా.. అయితే తప్పక ఈ విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ప్రస్తుతం రైల్వే స్టేషన్ అభివృద్ది పనులు జరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఎటువంటి సౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు, అయితే పలు అంశాలను తప్పక తెలుసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది.
అమృత్ భారత్ పథకం ద్వారా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను కేంద్రం అభివృద్ది చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పాత భవనాన్ని తొలగించే పనిలో నిమగ్నమైన అధికారులు, అభివృద్ది పనులను సైతం వేగవంతంగా సాగించేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం రూ. 720 మ కోట్ల నిధులు రైల్వే స్టేషన్ అభివృద్దికి ఖర్చు చేస్తుండగా, స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. నిత్యం ప్రయాణీకుల రద్దీతో ఉండే రైల్వే స్టేషన్ కు అన్ని సదుపాయాలు కల్పించడంతో పాటు, భద్రతా ప్రమాణాలను కూడా పెంచనున్నారు.
ప్రస్తుతం ఉత్తరం వైపు ఉన్న స్టేషన్ భవనం కూల్చివేత పనులు జరుగుతున్న నేపథ్యంలో స్టేషన్ కు వచ్చే ప్రయాణికులు తమ సూచనలు పాటించాలని రైల్వే అధికారులు కోరారు. ప్లాట్ ఫామ్ నెంబర్ 1 లోకి వెళ్లే ప్రయాణికుల కోసం గేట్ నంబర్ 2 అనగా గణేష్ ఆలయం ప్రక్కన ప్రవేశ ద్వారం ఏర్పాటు చేశారు. అలాగే జనరల్ బుకింగ్ కౌంటర్ సౌకర్యం కల్పించడంతో పాటు, మొత్తం 750 మంది ప్రయాణీకులు నిలిచే విధంగా వెయిటింగ్ హాల్ ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా గేట్ నంబర్ 3ని స్వాతి హోటల్ ఎదురుగా ఏర్పాటు చేయగా, గేట్ నంబర్ 8 భోయిగూడ వైపు ప్రవేశ ద్వారం వద్ద ప్లాట్‌ఫామ్ నంబర్ 10లోకి వెళ్లే మార్గాన్ని అధికారులు ఏర్పాటు చేశారు.
ప్రయాణీకుల సౌలభ్యం కోసం స్టేషన్ లోకి వచ్చే సూచిక బోర్డులను, అలాగే బయటకు వెళ్లే సూచిక బోర్డులను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. కుంభమేళాకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పలువురు కమర్షియల్ ఇన్‌స్పెక్టర్లను నియమించి 24 గంటలు వారి పర్యవేక్షణలో భక్తులకు సేవలు అందించనున్నారు. ఆలస్యంగా వచ్చే రైళ్ల సమాచారం అందించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించగా, భక్తుల భద్రత నేపథ్యంలో ఆర్పీఎఫ్ సిబ్బందిని కూడా స్టేషన్ లో పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. భద్రతా సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించడానికి నిరంతర సీసీకెమెరాల నిఘా ఉందని, మహిళల భద్రత కోసం ఆర్పీఎఫ్ శక్తి బృందాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ప్రయాణీకుల తక్షణ సహాయం కోసం హెల్ప్‌లైన్ 139ని సంప్రదించాలని అధికారులు సూచించారు.
Also Read: Man Breaks Train Door Video : తోటి ప్రయాణికులపై యువకుడు ఆగ్రహం.. ట్రైన్ డోర్ పగలకొట్టి…
ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తీసుకున్న రైల్వే సూచనలను ప్రయాణికులు పాటించాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది. అలాగే ఏదైనా సమస్య ఉంటే నేరుగా రైల్వే అధికారుల దృష్టికి తీసుకురావాలని, స్టేషన్ అభివృద్దికి రైల్వే తీసుకున్న నిర్ణయాన్ని ప్రయాణికులు స్వాగతించాలని రైల్వే కోరింది.