Police Ranking: స్వేచ్ఛ బ్యూరో: దేశంలో 7వ స్థానం.. రాష్ట్రానికి వచ్చేసరికి నెంబర్ వన్.. అదే శామీర్ పేట్ పోలీస్ స్టేషన్. ఈ మేరకు కొంతకాలం క్రితం కేంద్ర హోం మంత్రిత్వ వ్యవహారాల శాఖ ప్రకటన విడుదల చేస్తూ స్టేషన్లో పని చేస్తున్న సిబ్బందికి అభినందనలు కూడా తెలిపింది. అయితే, దీనిని సవాల్ చేస్తూ మేడ్చల్ జిల్లా బొమ్మరాసిపేట హనుమాన్ ఆలయం వద్ద ఉన్న లోకహిత సొసైటీ అధ్యక్షుడు వెంకటస్వామి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాస్తవాలు ఒకలా ఉండగా శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ కు ఈ ర్యాంకులు ఇవ్వటంపై ఆయన అభ్యంతరం వ్కక్తం చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు కేంద్ర హోం సెక్రటరీ, తెలంగాణ ప్రభుత్వం, డీజీపీ శివధర్ రెడ్డి, విజిలెన్స్ కమిషన్ ఛీఫ్, హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి, ఏసీబీడీజీపీ తదితరులకు నోటీసులు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా అధ్యయనం జరిపిన తరువాత కేంద్ర హోం మంత్రిత్వ వ్యవహారాల శాఖ శామీర్ పేట పోలీస్ స్టేషన్ కు 2025 సంవత్సరానికిగాను జాతీయ స్థాయిలో 7, రాష్ట్ర స్థాయిలో 1వ నెంబర్ స్టేషన్ గా గుర్తింపునిచ్చిన విషయం తెలిసిందే. పారదర్శకత, నూతన పద్దతుల ఆవిష్కరణ, నైపుణ్యం, జవాబుదారీతనం, పోలీసింగ్ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ర్యాంకులు కేటాయించినట్టుగా తెలిపింది. అయితే, దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వెంకటస్వామి నిజానికి శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో పరిస్థితులు దీనికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. లోకహిత సొసైటీ సభ్యుల్లో పలువురు ఈ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న కొందరు అవినీతి అధికారుల బాధితులని తెలిపారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ అధికారులు భూకబ్జాలకు సహకరిస్తూ వస్తున్నారని పేర్కొన్నారు. 2025, ఏప్రిల్ 28న ఇదే పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పని చేసిన పరుశురాం ఓ కేసులో 22వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని తెలియచేశారు. విచారణలో దీనికి ముందు సదరు ఎస్ఐ 2లక్షల రూపాయలు లంచంగా తీసుకున్నట్టుగా వెల్లడైందని పేర్కొన్నారు. మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు కూడా వచ్చాయని తెలిపారు. పై సంపాదనలకు మరిగి ఈ స్టేషన్ లో పని చేస్తున్న కొందరు సిబ్బంది సాగిస్తున్న అక్రమాలు.. చివరకు సొంత వాహనాల్లో పెట్రోల్, డీజీల్ నింపుకోవటానికి ప్రజల నుంచి ఎలా డబ్బు వసూలు చేస్తున్నారన్న వివరాలు కూడా మీడియాలో వచ్చినట్టు తెలిపారు. ఈ వార్త కథనాలకు సంబంధించిన క్లిప్పింగులను పిటిషన్ కు జత చేశారు.
Also Read: కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్లు.. ఓ కోటగాడు.. ఓ కోడికథ..!
ఇక, లోకహిత సొసైటీలో సభ్యులుగా ఉన్న సరస్వతి, త్రివేణి వర ప్రసాదరావు, జగదీశ్ బాబము, సీతా మహాలక్ష్మిలకు బొమ్మరాసిపేటలో భూములు ఉన్నట్టు పేర్కొన్నారు. కొంతమంది వీరి భూముల్లోకి అక్రమంగా చొరబడటానికి పలుమార్లు ప్రయత్నించారన్నారు. దాంతోపాటు ఇసుక తెచ్చి పోసి రోడ్డుకు అడ్డంగా గేట్లను నిర్మించే ప్రయత్నాలు కూడా చేశారన్నారు. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని వివరించారు. గత్యంతరం లేక హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారని, ఆ తరువాత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో మాత్రమే పోలీసులు కేసులు నమోదు చేశారన్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు, వినతిపత్రాల ప్రతులను పిటిషన్ కు జత చేశారు. ఇక, సొసైటీలో సభ్యునిగా ఉన్న దాసరి సుధాకర్ రెడ్డి వ్యవసాయ భూముల్లోకి కొంతమంది బలవంతంగా చొరబడి వాటిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరించారని తెలిపారు.
ఈ మేరకు సీసీ కెమెరాల ఫుటేజీతో సహా 2024, డిసెంబర్ 18న ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయలేదని వివరించారు. 2025, జనవరి 3న కేసులు నమోదు చేసినా భూమిని ఆక్రమించటానికి ప్రయత్నించిన కీలక వ్యక్తుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చలేదని తెలిపారు. దీనిపై రిట్ పిటిషన్ వేయగా హైకోర్టు 2025, ఫిబ్రవరి 24న సమగ్ర విచారణ జరపాలని ఆదేశాలు ఇచ్చినా అధికారులు మాత్రం జరపలేదన్నారు. దాంతో సుధాకర్ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయాల్సి వచ్చిందని వివరించారు. దాంతో తప్పనిసరై 2025, జూలైలో ఛార్జ్ షీట్ ను కోర్టుకు సమర్పించారని పేర్కొంటూ దీంట్లో కూడా ప్రధాన నిందితుని పేరును చేర్చలేదని వివరించారు. కీలక సాక్ష్యాలకు సంబంధించిన వివరాలను కూడా కోర్టుకు అంద చేయలేదని పేర్కొన్నారు.
ఇక, 2025, నవంబర్ 28న శామీర్ పేట పోలీసులు కొందరు రెవెన్యూ అధికారులతో కలిసి ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భూముల్లోకి ఎల్ఎంఐపీహెచ్ఎల్ (లియోనియా), నాయుడు, శ్రీనివాస్ అనే వ్యక్తులు చొరబడటానికి అవకాశం కల్పించినట్టు పేర్కొన్నారు. ఎలాంటి కోర్టు ఉత్తర్వులు, నోటీసులు ఇవ్వకుండానే మరొకరికి చెందిన భూముల్లోకి వీరిని పంపించారని తెలిపారు. ఇలా స్టేషన్ లో విచ్చలవిడిగా అవినీతి కొనసాగుతున్నా, ఆయా కేసుల దర్యాప్తులో విపరీతమైన జాప్యం జరుగుతున్నా దానికి జాతీయ స్థాయిలో 7, రాష్ట్ర స్థాయిలో నెంబర్ 1 ర్యాంక్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు వివరణ ఇవ్వాల్సిందిగా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
Also read: ఆ పథకానికి ప్రభుత్వం స్వాహా.. 62 వేల చీరలను వెనక్కి పంపిన సర్కార్!