Big Stories

Sharmila: డీకేతో షర్మిల దోస్తానా.. కాంగ్రెస్‌లో చేరిక నిజమేనా?

sharmila dk shivakumar

Sharmila: బెంగళూరులో డీకే శివకుమార్‌ను కలిసిన వైఎస్ షర్మిల. ఇటీవల కాలంలో ఇది రెండో భేటీ. డిప్యూటీ సీఎం అయినందుకు ఓ పూలబొకే ఇచ్చి.. విషెష్ చెప్పి వచ్చారు. అంతేనా? ఆ వెంటనే సోషల్ మీడియాలో అనేక కథనాలు వండి వార్చేశారు. పాత స్టోరీలను మళ్లీ కొత్తగా వేడి చేసి వడ్డించారు. కాంగ్రెస్‌లో షర్మిల చేరుతున్నారని.. డీకే శివకుమార్‌తో డీల్ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అందులోనూ మళ్లీ ట్విస్ట్. కొందరేమో తెలంగాణ కాంగ్రెస్ లోకి అంటుంటే.. మరికొందరేమో షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారంటూ న్యూస్ వైరల్ చేస్తున్నారు. ఇందులో ఏది నిజం?

- Advertisement -

ఆమె తండ్రి కాంగ్రెస్ సీఎం. ఆమె పార్టీ పేరులోనూ కాంగ్రెస్ ఉంది. తాను మాత్రం కాంగ్రెస్‌లో కలిసేదే లేదంటున్నారు వైఎస్ షర్మిల. విలీనం చేసేందుకైతే ఇంత కష్టపడి పార్టీ ఎందుకు పెడతాననేది షర్మిల వెర్షన్. అయితే, పార్టీ పెట్టే సమయంలో అలా అనుకోకపోయినా.. పార్టీని నడిపిస్తుంటేకానీ.. ఆ భారం, ఆ బాధ ఎలా ఉంటుందో షర్మిలకు తెలుసొస్తోందని అంటున్నారు. మీడియాలో మినహా.. జనంలో షర్మిల గురించి టాక్ అంతగా లేదు. పాదయాత్ర చేసినా ప్రజలు పట్టించుకోవట్లే. వైఎస్సార్‌టీపీలో పట్టుమని 10 బంది నేతలు కూడా ఉండట్లే. షర్మిల తర్వాత ఓ స్థాయి ఉన్న నేతలెవరూ లేకపోవడం బిగ్ మైనస్. ఇక కాలు బయటపెడితే అడ్డగింపులు, అరెస్టులు. ఆమె అరెస్ట్ అయినా.. రోడ్ల మీదికొచ్చి నిరసన తెలిపే కార్యకర్తలు కూడా లేకపాయే. ఇలా అనేక రకాలుగా రాజకీయ దెబ్బలు తగిలాక.. షర్మిలకు తత్వం బోధపడిందని అంటున్నారు.

- Advertisement -

రెండు వారాల క్రితమే డీకే శివకుమార్ పుట్టినరోజు వస్తే.. బెంగళూరు వెళ్లి మరీ శుభాకాంక్షలు చెప్పి వచ్చారు. అప్పటికే కర్నాటకలో కాంగ్రెస్ గెలిచేసింది. అందుకే వెళ్లుంటారని అనుకున్నారంతా. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారంటూ మరోసారి ఆయనింటికి వెళ్లి మరీ విషెస్ చెప్పడం మాత్రం అంత లైట్‌గా తీసుకునే విషయం కాదు. రెండు వారాల్లోనే రెండుసార్లు కలవడం వెనుక రాజకీయ కారణాలు లేవని అనుకోలేం. పర్సనల్, ఫ్యామిలీ ఫ్రెండ్ అయితే.. ఏ ఫోన్లోనో, వాట్సాప్‌లోనే చెప్పొచ్చు. వెళ్లి కలిసి మరీ ప్రత్యేకంగా చెబుతున్నారంటే.. అదికూడా గతంలో లేనివిధంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిచాకే ఇలా జరుగుతోందంటే.. సంథింగ్ సంథింగ్ అనుకోక తప్పదు.

ఇటీవల కాలంలో డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీకి ట్రబుల్ షూటర్‌గా మారారు. దేశంలోని ఏ రాష్ట్ర కాంగ్రెస్‌కు అవసరం వచ్చినా.. తానున్నానంటూ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. కర్నాటక తర్వాత కాంగ్రెస్ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణే. ఇక, వైఎస్ షర్మిలకు మద్దతుగా నిలిచే అవకాశం ఉన్న వర్గమంతా.. క్రిస్టియన్, ముస్లిం మైనార్టీలు, వైఎస్సార్ అభిమానులే. ఆ లెక్కన.. వారంతా కాంగ్రెస్‌ ఓటుబ్యాంకే. సో.. షర్మిల పార్టీతో అందరికంటే ఎక్కువ నష్టం.. హస్తం పార్టీకే అని చెబుతున్నారు. ప్రస్తుత ట్రయాంగిల్ వార్‌లో ప్రతీ ఓటు, ప్రతీ సీటు ముఖ్యమనేలా పోరు సాగుతుండగా.. షర్మిల పార్టీ వల్ల నష్టపోకూడదని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. అందుకే, షర్మిల పార్టీని విలీనం చేస్తానంటే.. హస్తం అధిష్టానం సాదరంగా ఆహ్వానించొచ్చు.

మరి, షర్మిల వైఎస్సార్‌టీపీని ఎందుకు విలీనం చేస్తారు? రాజకీయం చేయడం, పార్టీని నడపడం అంత ఈజీ కాదని ఇప్పటికే ఆమెకు తెలిసొచ్చే ఉంటుంది. ఏళ్లు గడుస్తున్నా.. ఖర్చులు పెరుగుతున్నా.. ఎలాంటి ఆశావాహ పరిస్థితులు కనిపించకపోవడంతో.. ఓ దశలో ఆమెకూ నిరాశ వచ్చే ఉంటుంది. భవిష్యత్తుపై ఆశలు సన్నగిల్లే ఉంటాయి. ఏ ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా.. అసెంబ్లీ ఎలక్షన్ల వరకూ పార్టీని ఎలాగోలా లాక్కొచ్చినా.. ఈసారి మాత్రం బరిలో దిగక తప్పని పరిస్థితి. ఆమె స్వయంగా పాలేరులో పోటీ చేస్తానంటున్నారు. మరి, గెలుస్తారా? వైఎస్సార్‌టీపీ తరఫున ఎంతమంది బరిలో నిలుస్తారు? ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారా? ఇన్నాళ్లూ పిడికిలి మూసిఉంచుతూ.. లోపల ఏదో ఉందంటూ.. పైపై ప్రచారాలతో ఊదరగొడుతూ.. నిత్యం లైమ్‌లైట్లో అయితే ఉండగలిగారు షర్మిల.

వైఎస్సార్‌టీపీ బలం, బలగం ఎంతో ఈసారి ఎన్నికల్లో తేలిపోనుంది. ఆ విషయం ఆమెకూ తెలుసు. ఆ తర్వాత పరువు నిలుస్తుందా? పోతుందా? అనేదానిపైనా క్లారిటీ ఉండే ఉంటుంది. అందుకే, ఎన్నికల ముందే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేస్తే.. ఆ పేరుతో కీలక పదవి పట్టేస్తే.. వైఎస్సార్ బిడ్డగా గౌరవమూ ఉంటుంది.. జాతీయ పార్టీలో చెప్పుకోదగ్గ పదవీ వస్తుంది.. కాంగ్రెస్ బలం తన బలగంగా మారుతుంది.. ఇలా, ఒక్క అడుగు వెనక్కు వేస్తే.. అనేక ప్రయోజనాలు. మొండిగా ఒంటరిగా ముందుకెళితే.. ఏం జరుగుతుందో అందరికంటే షర్మిలకే బాగా తెలుసు. సో, ఆ భవిష్యత్ రాజకీయ అడుగులు సాఫీగా పడాలంటే.. తాను కోరుకున్నట్టు డీల్ కుదరాలంటే.. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమారే బెస్ట్ ఆప్షన్‌గా షర్మిలకు కనిపించారని అంటున్నారు. అందుకే, పాత పరిచయాలను గుర్తు చేస్తూ.. కొత్తగా కలుపుకొని పోతున్నారని చెబుతున్నారు. ఏమో. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేగా!

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News