Sigachi company accident: రెండు రోజుల క్రితమే సిగాచి పరిశ్రమలో ఉద్యోగం వచ్చింది. భార్య, బిడ్డతో ఉన్న జీవితంలో కొంత వెలుగు కనిపించిందన్న ఆశ. కానీ ఉద్యోగానికి వెళ్లిన రెండో రోజే ప్రమాదం. 70 శాతం కాలిన గాయాలతో ఇప్పుడు మంచానికే పరిమితమయ్యాడు మహారాష్ట్రకు చెందిన కార్మికుడు భీమ్ రావు. పటాన్ చెరువులోని ఆసుపత్రిలో ఆయన కోసం కుటుంబం రోజూ కన్నీటితో కాలం గడుపుతోంది.
వదలని భయం..
పాశమైలారం ప్రాంతంలో ఉన్న సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదం ఇప్పటికీ ప్రజల గుండెల్లో వణుకులు పుట్టిస్తోంది. ఈ ప్రమాదం వల్ల తీవ్రంగా గాయపడిన వారిలో మహారాష్ట్రకు చెందిన కార్మికుడు భీమ్ రావు కథ మాత్రం ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. ఉద్యోగంలో చేరిన రెండో రోజే బీమ్ రావు జీవితమంతా మారిపోయింది. పరిశ్రమలో ప్రమాదం జరగడం, అతడు 70 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండటం, అతడి కుటుంబం ఆసుపత్రి ముందు శ్వాస ఆడకుండా వేచి ఉండడం.. ఇవన్నీ ఒక సినిమాకథలా అనిపించొచ్చు కానీ.. ఇది నిజమైన జీవితం.
మహారాష్ట్ర నుండి వచ్చి మంచానికే పరిమితమై..
భీమ్ రావు, ప్యాకింగ్ విభాగంలో ఉద్యోగం వచ్చింది కాబట్టి.. కుటుంబానికి ఆదాయం వస్తుందని ఆశించాడు. రెండు సంవత్సరాల క్రితం మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. మొదట పటాన్ చెరువు ప్రాంతంలో సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం గడిపాడు. 5 సంవత్సరాల క్రితం వివాహమైన భీమ్ రావుకు ఒక ఆరేళ్ల కూతురు ఉంది. భార్య సోని, కూతురు ఇద్దరితో కలిసి బండ్లగూడలో నివాసం ఉంటున్నాడు. రోజువారి ఖర్చులు, ఇంటి అద్దె, కూతురు చదువు వంటి బాధ్యతల నడుమ భీమరావు కుటుంబం సాదాసీదాగా జీవనం సాగించేది.
వెలుగు అనుకుంటే.. చీకటి పలకరించింది
ఈ నేపథ్యంలోనే సిగాచి కంపెనీలో ఉద్యోగం రావడం ఆయన కుటుంబానికి కొత్త వెలుగు చూపించింది. కానీ ఆ వెలుగు మరుసటి రోజే చీకటైంది. ఉద్యోగంలో చేరిన రెండో రోజే దురదృష్టవశాత్తూ కంపెనీలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. బీమ్ రావు శరీరంపై 70 శాతం కాలిన గాయాలు జరిగాయి. ప్రస్తుతం పటాన్ చెరువులోని ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆసుపత్రి బయట భార్య సోని కన్నీళ్లు ఆపుకోలేక తల్లడిల్లుతున్న పరిస్థితి. ఉద్యోగం వస్తే బాగుంటుంది అనుకున్నాం, ఇలా జరుగుతుందనుకోలేదు. మా బిడ్డ ఏం చేస్తుంది? ఆయనకి ఏం అయిందో తెలియదు.. అయినా ఎవరైనా చూడండి అంటూ వాపోతున్నారు అతని కుటుంబసభ్యులు. తమను ఆదుకోవాలని, భీమ్ రావు చికిత్సకు సహాయంగా ముందుకు రావాలని వేడుకుంటున్నారు. పేద కార్మికుల భద్రతపై అధికార యంత్రాంగం మరింత జాగ్రత్త వహించాలని ప్రశ్నిస్తున్నారు.
Also Read: RailOne app: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ ఒక్కటి డౌన్లోడ్ చేయండి.. ఆ తర్వాత!
ఈ ప్రమాదం కేవలం భీమ్ రావుకే కాకుండా.. అక్కడ పనిచేసే మరోమంది కార్మికుల జీవితాలపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఒక్కో కుటుంబానికి ఒక్కో విషాద గాథ. ఎవరి జీవితంలో ఏం జరిగిందో, ఎవరు ప్రాణాలతో బయటపడ్డారో తెలియని పరిస్థితి. పరిశ్రమల్లో భద్రతాపరమైన నియమాలు పాటించడంలో యాజమాన్యాల నిర్లక్ష్యం ఇలాంటి ఘటనలకు దారితీస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఒకరికి ఉద్యోగం రావాలంటే ఎంత కష్టపడతారో, కుటుంబంతో పాటు భవిష్యత్తు కలలు కంటారో తెలియదు కానీ.. ఒక చిన్న నిర్లక్ష్యం అంతా మట్టిపాలయ్యేలా చేస్తోంది. భీమ్ రావు పరిస్థితి చూస్తే వేదన కలుగుతుంది. వృత్తిపరంగా స్థిరపడేందుకు తపించిన ఓ యువకుడి జీవితం ఇలా మధ్యలో నిలిచిపోవడమే కాదు, అతడి కుటుంబం మారిన పరిస్థితుల్ని ఊహించడమే కష్టంగా మారింది.
ఈ ఘటనలపై నిష్పాక్షిక విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడం తప్పక అవసరమని స్థానికుల వాదన. అలాగే పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది భీమరావు మాత్రమే కాదు.. ప్రతి పేద కార్మికుడి భద్రతకోసం ప్రభుత్వాలు మేల్కొనాల్సిన అవసరమున్న ఘట్టమని విమర్శలు వినిపిస్తున్నాయి.