RailOne app: ఇప్పటి వరకు రైలు ప్రయాణికులకు టికెట్ బుకింగ్ చేయాలంటే ఒక యాప్, ట్రైన్ స్టేటస్ చెక్ చేయాలంటే మరో యాప్, ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలంటే ఇంకో యాప్, ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలంటే వేరే యాప్ ఉండాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ గందరగోళానికి పూర్తి స్థాయిలో ముగింపు పలికేలా భారతీయ రైల్వేలు ఒక కొత్త రైల్‌వన్ (RailOne) అనే సూపర్ యాప్‌ను తీసుకొచ్చింది. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వయంగా దీనిని ప్రారంభించారు. అయితే రైల్వే ప్రయాణికులకు ఈ యాప్ తో ఏంటి ప్రయోజనం? అసలు ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలియాలంటే.. తప్పక ఈ కథనం పూర్తిగా చదవండి.
యాప్ స్పెషాలిటీ తెలుసుకుంటే.. ఔరా అనేస్తారు
ఈ యాప్ ప్రత్యేకత ఏమిటంటే.. ఒకే మొబైల్ యాప్‌లో రైల్వేకు సంబంధించిన అన్ని సేవలు అందుబాటులో ఉండటం. అంటే, మీరు రిజర్వేషన్ టికెట్లు, అన్‌రిజర్వ్ టికెట్లు, ప్లాట్‌ఫాం టికెట్లు, PNR స్టేటస్, ట్రైన్ స్టేటస్, కోచ్ పొజిషన్, ఫుడ్ ఆర్డర్, ఫిర్యాదుల సబ్మిషన్ వంటి సేవలన్నింటినీ ఒకే యాప్‌లో చూసుకోవచ్చు. ఇక UTS, Rail Madad, IRCTC Rail Connect, NTES వంటి వేర్వేరు యాప్‌లు మొబైల్‌లో ఉంచాల్సిన అవసరం ఇక ఉండదు. దీనివల్ల మొబైల్ ఫోన్‌లో స్పేస్ కూడా ఆదా అవుతుంది.
ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు..
ఈ యాప్ ద్వారా ఉపయోగపడే మరొక ముఖ్యమైన అంశం సింగిల్ సైన్-ఆన్ (Single Sign-On) వ్యవస్థ. అంటే మీరు RailConnect, UTSonMobile యాప్‌లో లాగిన్ అయ్యే క్రెడెన్షియల్స్‌తోనే ఈ RailOne యాప్‌కి లాగిన్ అవ్వచ్చు. పాస్‌వర్డులు గుర్తుపెట్టుకోవాలన్న తలనొప్పి అవసరం లేదు. అంతేకాకుండా కొత్త యూజర్లు కూడా కేవలం మొబైల్ నెంబర్‌తో OTP ద్వారా గెస్ట్ యాక్సెస్ పొందవచ్చు. మరింత భద్రత కోసం బయోమెట్రిక్ లేదా న్యూమరిక్ పిన్ (mPIN) ద్వారా లాగిన్ చేసే అవకాశం కూడా ఉంది.
సమస్య వచ్చినా.. ఈ యాప్ క్లిక్ చేయండి
రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ యాప్ రూపకల్పనలో ప్రధాన లక్ష్యం ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడం. క్లీన్ ఇంటిగ్రేటెడ్ యూజర్ ఇంటర్‌ఫేస్ (UI) వల్ల ప్రతి యూజర్‌కు అన్నీ ఒకేచోట స్పష్టంగా కనిపిస్తాయి. ఇక ప్రయాణ సమయంలో ఏదైనా సమస్య ఎదురైతే, Rail Madad సేవలు కూడా యాప్‌లోనే అందుబాటులో ఉండటం మరొక ప్రధాన హైలైట్. అలాగే, Food on Train సదుపాయం కూడా ఇందులో ఉంటుంది. ప్రయాణానికి ముందే భోజనం ఆర్డర్ చేసుకోవచ్చు.
Also Read: Kalpavriksha Joshimath: 2500 ఏళ్ల చెట్టు.. పక్షి వాలితే ఒట్టు.. ఎక్కడో కాదు ఇక్కడే!
ఈ యాప్‌లో R-Wallet అనే ప్రత్యేక ఫీచర్ ఉంది. ఇది రైల్వేకు చెందిన స్వంత డిజిటల్ వాలెట్. దీని ద్వారా టికెట్ల కొనుగోలు, ఫుడ్ బిల్లులు తదితర సేవలకన్నీ చెల్లింపులు తక్కువ టైమ్‌లో, ఎక్కువ భద్రతతో చేయవచ్చు. దీని ఉపయోగం యాప్ యూజర్ అనుభవాన్ని మరింత సాఫీగా మార్చుతుంది.
ఈ యాప్ కేవలం ప్రయాణికుల కోసమే కాకుండా, సరుకు రవాణా సేవల కోసం కూడా అవసరమైన సమాచారం అందిస్తుంది. అంటే ఇది ఒక పూర్తిస్థాయి రైల్వే డిజిటల్ ప్లాట్‌ఫాం అన్నమాట. IRCTC, CRIS వంటి సంస్థల అనుభవంతో కూడిన ఈ యాప్, రైల్వే ప్రయాణ అనుభవాన్ని పూర్తిగా డిజిటల్ మార్గంలోకి తీసుకెళ్తోంది.
ఇప్పుడు మీరు ఓ రైలు టికెట్ బుక్ చేసుకోవాలంటే, ట్రైన్ ఎక్కడుందో తెలుసుకోవాలంటే, టిఫిన్ ఆర్డర్ చేయాలంటే, ఏ ఫిర్యాదైనా ఇవ్వాలంటే ఇక వేర్వేరు యాప్‌లు ఓపెన్ చేయాల్సిన పని లేదు. అన్ని ఒకే యాప్‌లో, అదే RailOne. ఇది కేవలం మొబైల్ యాప్ కాదు.. రైలు ప్రయాణికుడికి ఒక సులభమైన మార్గదర్శి. మీ దగ్గర ఈ యాప్ ఇంకా లేదంటే, ఇప్పుడే ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోండి. ప్రయాణం మొదలుపెట్టే ముందు రైల్‌వన్ ను ఓపెన్ చేయడం మర్చిపోకండి!