Singareni Employees: సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు దసరా పండుగ సందర్భంగా భారీ గుడ్ న్యూస్ అందింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం, సింగరేణిలో పనిచేస్తున్న అర్హులైన రెగ్యులర్ సిబ్బందికి అడ్వాన్స్ రూపంలో రూ.25 వేల చెల్లింపు జరగనుంది. అదే సమయంలో తాత్కాలిక కార్మికులకు కూడా ప్రత్యేకంగా రూ.12,500 అడ్వాన్స్ అందించనుంది. ఈ మొత్తాలను సెప్టెంబర్ 23న నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనుందని అధికారులు తెలిపారు.
లాభాల బోనస్ ప్రకటించిన సింగరేణి
సింగరేణి ఆర్థిక లాభాలను దృష్టిలో ఉంచుకుని, ఈ సంవత్సరం కార్మికులకు లాభాల వాటా కింద 35 శాతం బోనస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ప్రతి ఉద్యోగి, కార్మికుడికి సుమారు రూ.2.10 లక్షల వరకు బోనస్ లభించే అవకాశముందని అంచనా. ఈ ప్రకటనతో సింగరేణి ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. పండుగ ముందురోజే ఈ సంతోషకరమైన వార్త రావడంతో కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
సిఎం రేవంత్ రెడ్డి చేత బోనస్ ప్రకటన
సింగరేణి లాభాల బోనస్ అధికారిక ప్రకటన కార్యక్రమం ఈ రోజు సచివాలయంలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈ బోనస్‌ను అధికారికంగా ప్రకటించారు. ఆయనతో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్, ఎంపీలు రఘురాం రెడ్డి, బలరాం నాయక్, సింగరేణి సీఎండీ బలరాం, పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
సింగరేణి ఉద్యోగుల త్యాగం, కృషికి గుర్తింపు
సింగరేణి సంస్థ 2024–25 ఆర్థిక సంవత్సరంలో విశేష లాభాలు సాధించింది. ఈ విజయానికి ప్రధాన కారణం కార్మికుల అహర్నిశ కృషి. కష్టతరమైన పరిస్థితుల్లోనూ వారు చేసిన పని వలనే సంస్థ లాభాల దిశగా ముందుకు సాగిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కార్మికుల త్యాగానికి గుర్తింపుగా, వారి కుటుంబాల ఆర్థికంగా తోడ్పడేలా ఈ బోనస్‌ను ప్రకటించినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఉద్యోగులు, కార్మికుల్లో ఆనందం
అడ్వాన్స్‌తో పాటు లాభాల బోనస్ ప్రకటన రావడంతో.. ఉద్యోగుల్లో పండుగ వాతావరణం నెలకొంది. పిల్లల చదువులు, కుటుంబ అవసరాలు, పండుగ ఖర్చులు ఇలా అనేక రంగాల్లో ఈ డబ్బు ఉపశమనాన్ని కలిగిస్తుందని కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, తాత్కాలిక కార్మికులకు కూడా ప్రత్యేకంగా అడ్వాన్స్ ఇచ్చిన యాజమాన్యం నిర్ణయం అభినందనీయమని వారు పేర్కొంటున్నారు.
Also Read: G ST 2.O లో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే
ప్రభుత్వ నిబద్ధత
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి సంస్థ భవిష్యత్తుపై కీలక ప్రకటనలు చేశారు. కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా సింగరేణిని తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. లాభాల బాటలోకి సంస్థను నడిపించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సవరణల కారణంగా తెలంగాణకు సుమారు ₹7 వేల కోట్లు ఆదాయం తగ్గిందని పేర్కొన్నారు. ఈ లోటును వెంటనే భర్తీ చేయాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలపై ఈ ప్రభావం పడకుండా చూడటమే లక్ష్యమని అన్నారు.
సింగరేణి కార్మికులు సమావేశంలో ముఖ్యమంత్రికి తమ సమస్యలను వివరించారు. ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిన కొన్ని గనులను తిరిగి సింగరేణికి అప్పగించేలా చూడాలని వారు కోరారు. ప్రైవేట్ భాగస్వామ్యం పెరిగిపోతే భవిష్యత్తులో సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.