మరోవైపు టన్నెల్‌కు అడ్డుగా పేరుకుపోయిన టీబీఎం శిథిలాలను తొలగించేందుకు ఎల్అండ్ టీ, నవయుగ, మేఘా కంపెనీ ఎక్స్‌పర్ట్స్ శ్రమిస్తున్నారు. మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు వీరంతా టన్నెల్లోకి వెల్డింగ్ మెషీన్లు, కట్టర్లను తీసుకెళ్లి ఒక్కొక్కటే కట్ చేస్తున్నారు. మరికాసేపట్లో కన్వేయర్ బెల్టును పునరుద్ధరించి డెబ్రిస్‌ను బయటకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు సెగ్మెంట్ బ్లాక్స్ నుంచి ధారాపాతంగా వస్తున్న సీపేజ్, కూలుతున్న మట్టి పెల్లలతో టన్నెల్లో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఇలాంటి టైంలో రెస్క్యూ ఆపరేషన్ చాలా డేంజర్ అని స్వయంగా ఎన్జీఆర్ఐ నిపుణులు హెచ్చరించడంతో సహాయక బృందాలు అత్యంత జాగ్రత్తతో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.
కాగా.. 11.5 కి.మీ నుంచి ఎయిర్ సప్లయ్ పైప్‌లైన్ వ్యవస్థ ధ్వంసమైంది. మరో వైపు జీఎస్‌ఐ, ఎన్‌జీఆర్‌ఐ ఎక్స్‌పర్ట్స్ బురద పరిస్థితిపై అంచనా వేస్తున్నారు. 200 మీటర్ల వరకు 15 అడుగుల ఎత్తులో బురద పేరుకుపోయింది. సొరంగంలో ప్రస్తుతం గంటకు 3600 నుంచి 5000 లీటర్ల ఊట వస్తోంది. సొరంగ మార్గంలో 10వేల క్యూబిక్ మీటర్ల బురద ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. బురదను బయటకు తీయడమే పెద్ద టాస్క్ అని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ప్రస్తుతం కన్వేయర్ బెల్ట్‌కు రిపేర్లు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రానికి కన్వేయర్ బెల్ట్ రిపేర్ పూర్తయ్యే ఛాన్స్ ఉంది. కన్వేయర్ బెల్ట్‌తో గంటకు 800 టన్నుల బురద బయటకు తోడే అవకాశముందని చెబుతున్నారు.
Also Read: షాకైన ప్రైవేటు యాజమాన్యాలు.. ఇకపై తెలుగు తప్పనిసరి.. ఆపై వెన్నెల ఎంట్రీ
టీబీఎం మెషిన్ దాటిన తర్వాత 100 మీటర్ల మేర బురద పేరుకుపోయింది. అక్కడి వరకు వెదురు బొంగులు, థర్మకోల్ షీట్స్‌తో చేసిన ఫిషింగ్ బోట్లతో రెస్క్యూ టీమ్స్ వెళ్లగలుగుతున్నాయి. ఆ తర్వాత దట్టమైన బురద సుమారు ఆరేడు అడుగుల ఎత్తులో పేరుకుపోయి ఉంది. ఆ అడ్డంకి దాటితేనే ప్రమాదానికి గురైన TBM ముందు భాగం, అందులో చిక్కుకుపోయిన 8 మందిని గుర్తించే అవకాశముంటుంది. అయితే ఆ ప్రాంతానికి సహాయక బృందాలు వెళ్లలేకపోతున్నాయి. పుషింగ్ కెమెరాలు, డ్రోన్లు, సిగ్నిలింగ్ వ్యవస్థ.. ఎన్ని ఏర్పాట్లు చేసినా ఫలితాలు రావడం లేదు.
ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకునేందుకు సొరంగంపై నుంచి కాని, పక్క నుంచి కానీ.. వెళ్లే మార్గాలను కూడా అన్వేషిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సహాయక బృందాలతో రెండు సార్లు సమీక్షలు నిర్వహించారు. ఇండియన్ నేవీ, ఎన్డీఆర్ఎఫ్ కలిసి ప్రయోగాత్మకంగా మరోసారి సొరంగంలోకి వెళ్లి, ఇవాళ టార్గెట్ ఏరియాకి వెళ్లేందుకు ప్రయత్నిస్తారన్నారు. 8మంది ప్రాణాలను కాపాడటమే మొదటి ప్రాధాన్యంగా చర్యలు చేపడతున్నట్లు ఉత్తమ్ వివరించారు.