Vande Bharat Train Brake Failure: బ్రేకులు సరిగా పనిచేయడం లేదని లోకో పైలట్లు పదేపదే హెచ్చరించినా రైల్వే అధికారులు పట్టించుకోలేదా? బ్రేకింగ్ వ్యవస్థ సరిగా పనిచేయని ఖాళీ వందే భారత్ రైలు ఏకంగా 463 కిలోమీటర్లు ప్రయాణించిందా? రెండు రాష్ట్రాల మీదుగా సాగిన ఈ ప్రయాణంలో రైలు ఎక్కడైనా అదుపు తప్పి ఉంటే..? ఊహించుకుంటేనే భయంకరమైన ఈ ఘటనపై రైల్వే శాఖ తీవ్రంగా స్పందించింది. బాధ్యులపై విచారణకు ఆదేశించింది.
ఈ ఘటన అక్టోబర్ 24న జరిగింది. జార్ఖండ్ లోని హతియా నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి ఖాళీ వందే భారత్ రైలు కోచ్‌లను తరలించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం ఒక ఫ్రైట్ లోకోమోటివ్‌ను ఉపయోగించారు. అయితే, ప్రయాణం ప్రారంభమైన కొద్దిసేపటికే రైలులో బ్రేకింగ్ సమస్య ఉన్నట్లు గుర్తించారు. హతియా నుంచి రాంచీ మధ్య నిర్వహించిన బ్రేక్ టెస్ట్ లో రైలు బ్రేకుల సామర్థ్యం చాలా తక్కువగా ఉందని లోకో పైలట్ గుర్తించారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేశారు.
రాంచీ స్టేషన్‌కు చేరుకున్న తర్వాత లోకో పైలట్ బ్రేకుల సమస్యపై సెక్షన్ కంట్రోలర్, ట్రాక్షన్ లోకోమోటివ్ కంట్రోలర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ, రైలును ముందుకు వెళ్లేందుకు అనుమతించారు. ఆ తర్వాత మురి స్టేషన్ నుంచి రైలును నడిపిన మరో లోకో పైలట్ కూడా ఇదే సమస్యను గుర్తించారు. బ్రేక్ పైపు ఒత్తిడిని తగ్గించినా బ్రేకులు సరిగా పనిచేయడం లేదని అధికారులకు సమాచారం ఇచ్చారు. అయినా రైలు ప్రయాణాన్ని ఆపలేదు.
చివరకు ఉత్తరప్రదేశ్‌లోని చందౌలి జిల్లాలో ఉన్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాతే అధికారులు స్పందించారు. అక్కడ రైలును తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. వందే భారత్ రైలులోని అన్ని కోచ్‌ల బ్రేకింగ్ వ్యవస్థలను వేరుచేసి ఉంచినట్లు గుర్తించారు. దీంతో కోచ్‌లకు బ్రేకులు పనిచేయడం లేదు. ఈ పరిస్థితిలో రైలు కేవలం లోకోమోటివ్ బ్రేకులు, రీజనరేటివ్ బ్రేకింగ్ సాయంతోనే ప్రయాణించినట్లు తేలింది.
ఈ ఘటనపై సౌత్ ఈస్టర్న్ రైల్వే సమగ్ర విచారణకు ఆదేశించింది. ప్రాథమిక విచారణలో కోచ్, వ్యాగన్ నిర్వహణ సిబ్బందితో పాటు స్టేషన్ కంట్రోలర్లు, ట్రాక్షన్ కంట్రోలర్లు, రైలు నడిపిన సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నట్లు గుర్తించారు. రైలు బయలుదేరే ముందు బ్రేకులు సరిగా పనిచేస్తున్నాయో? లేదో? తనిఖీ చేయాల్సిన బాధ్యతను మెయింటెనెన్స్ సిబ్బంది పట్టించుకోలేదని విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా వందే భారత్ బ్రేకింగ్ వ్యవస్థపై రైలు సిబ్బందికి సరైన అవగాహన లేకపోవడం కూడా సమస్యకు కారణంగా వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరి నిర్లక్ష్యం ఎంత వరకు ఉందో పూర్తి స్థాయిలో విచారించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖ భావిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.
Read Also: మన రైల్వే టెక్నాలజీకి జపాన్ ఫిదా.. ఏకంగా ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేసింది!