SPDCL Employees: స్వేచ్ఛ బ్యూరో: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ(ఎస్పీడీసీఎల్)కు చెందిన ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు పరిమిత సంఖ్యలో ఉన్న ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాన్ని విస్తరించి, ప్రధాన కార్పొరేట్, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. గతంలో ఎస్పీడీసీఎల్ తో ఒప్పందం కుదుర్చుకున్న 71 ఆసుపత్రుల్లో మాత్రమే ఉద్యోగులు, పెన్షనర్లు వైద్య చికిత్స పొందే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఈ వైద్య సౌకర్యాన్ని విస్తరించి, ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులు సహా దాదాపు 253 ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. సంస్థ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధుల అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వీ పాటిల్ గురువారం దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంతో సంస్థ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి ఆధారితులకు మరింత విస్తృతంగా, సులభంగా నాణ్యమైన వైద్య సేవలు పొందే అవకాశం కలగనుంది.
ఎస్పీడీసీఎల్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు, క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరతను అధిగమించేందుకు సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కేవలం విద్యుత్ బిల్లులు తీసేందుకే పరిమితమైన ప్రైవేట్ స్పాట్ బిల్లింగ్ మీటర్ రీడర్ల సేవలను, ఇకపై ఇతర ఆపరేషనల్ పనుల కోసం కూడా ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ప్రతి నెలా బిల్లింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత(11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు), సుమారు 12 రోజుల పాటు వీరి సేవలను ఇతర పనులకు వినియోగించుకోనున్నారు. సంస్థలో ఆపరేషన్స్ అండ్ మెయింటెనన్స్ విభాగం, ఆర్టీజన్లపై ఉన్న పని భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేనేజ్‌మెంట్ తెలిపింది. ఈ విధానాన్ని ప్రాథమికంగా మూడు నెలల పాటు అమలు చేయనున్నారు.
Also Read: Maoist Son Letter: నాన్నా.. నిన్ను చూడాలని ఉంది అంటూ.. మావోయిస్టు కుమారుడి ఆడియో వైరల్..!
అవసరానికి అనుగుణంగా దీనిని మరింత పొడిగించే అవకాశం ఉంది. ఈ అదనపు పనులకు గానూ వీరికి సెమీ స్కిల్డ్ కేటగిరీ కింద రోజువారీ వేతనాలను చెల్లిస్తారు. వీరికి ఈపీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు కూడా వర్తిస్తాయి. మార్చి 2026 బిల్లింగ్ ప్రక్రియ ముగిసేలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని, ఈ మేరకు కాంట్రాక్టర్లకు సమాచారం అందించాలని ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్లను సంస్థ ఆదేశించింది. ఇప్పటికే ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్)లో ఈ విధానం విజయవంతంగా అమలవుతుండటంతో, ఇప్పుడు ఎస్పీడీసీఎల్ కూడా అదే బాటలో పయనిస్తోంది. దీనివల్ల వినియోగదారులకు అందే సేవల్లో జాప్యం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
Also Read: Trump Hints Next War: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్లారిటీ.. ఇరాన్ తర్వాత ఆ దేశంపై వార్