Sridhar Babu: తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు అరుదైన గౌరవం లభించింది. అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ ప్రకటించిన ‘ఇండియాస్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ-2025’ జాబితాలో చోటు దక్కింది. విధాన రూపకర్తల కేటగిరిలో మంత్రి శ్రీధర్‌బాబు, కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్, పీయూష్ గోయల్ వంటి ప్రముఖులకు చోటు కల్పించినట్టు ఆ సంస్థ వెల్లడించింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో దేశంలో అత్యంత ప్రభావవంతమైన నాయకులలో ఒకరిగా ఐటీ-పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబును ఎంపిక చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఆవిష్కరణలు, భవిష్యత్తు కోసం ఆలోచించే విధానాలను ప్రోత్సహించడం ద్వారా తెలంగాణను స్టార్టప్ రాజధానిగా మాత్రమే కాకుండా సమ్మిళిత AIకి ప్రపంచ కేంద్రంగా మార్చడంలో ఆయన కృషిని కొనియాడారు.
శ్రీధర్ బాబు అంకితభావం, ఆవిష్కరణ పట్ల నిబద్ధత తెలంగాణను AI విప్లవంలో ముందంజలో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ భారత్‌ను ఏఐ సెక్టార్‌లో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తోన్న వ్యక్తులతో ఈ జాబితాను రూపొందించినట్టు ఆ సంస్థ ప్రకటించింది.
దేశంలో తొలిసారిగా ఏఐ ఆధారిత తెలంగాణ డేటా ఎక్స్‌చేంజ్‌ను ప్రారంభించారు. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ ఏఐ సమ్మిట్‌లో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో శ్రీధర్‌బాబును ఎంపిక చేశామని అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ పేర్కొంది.
ALSO READ: హైదరాబాద్‌లో 400 అడుగుల జాతీయజెండాతో భారీ ర్యాలీ
తెలంగాణలో ఏర్పాటు కానున్న ఏఐ విశ్వవిద్యాలయంలో శ్రీధర్‌బాబు పాత్రను కొనియాడింది ఆ సంస్థ. మరోవైపు అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ జాబితాలో తనకు చోటు లభించడంపై మంత్రి శ్రీధర్‌బాబు హర్షం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రోత్సా హం వల్ల ఈ ఘనత సాధ్యమైందని మనసులోని మాట బయటపెట్టారు.