
Heart Attack : కరోనా తర్వాత గుండెపోట్లు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా యువత హార్ట్ ఎటాక్స్ కు బలవుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో ఓ యువకుడు ఇలాగే ప్రాణాలు కోల్పోయాడు. ఖమ్మం బాలపేటకు చెందిన 31 ఏళ్ల శ్రీధర్ జిమ్ లో వ్యాయామం చేసి ఇంటికి వెళ్లాడు. అయితే కాసేపటికే అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
శ్రీధర్ ను వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. కానీ కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. ఆ యువకుడు గతంలో ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత చికిత్స పొంది కోలుకున్నాడు. ఇప్పుడు ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబంలో విషాదం నింపింది.
శ్రీధర్ తండ్రి మానుకొండ రాధా కిశోర్ గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఆయన ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటి ఛైర్మన్ గా కొనసాగారు. శ్రీధర్ మృతిపై పలువురు నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఖమ్మం అల్లిపురంలో ఆదివారం 33 ఏళ్ల నాగరాజు అనే యువకుడు కూడా ఇలాగే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఇలా యువకులు గుండెపోట్లకు బలికావడం ఆందోళన కలిగిస్తోంది.