BigTV English

Telangana Politics: ఎన్నికల రేస్.. . కాంగ్రెస్ దూకుడు.. టాప్ గేర్ లో కారు.. బీజేపీ సంగతేంటి?

Telangana Politics: ఎన్నికల రేస్.. . కాంగ్రెస్ దూకుడు.. టాప్ గేర్ లో కారు.. బీజేపీ సంగతేంటి?
Political News in Telangana

Political news in telangana:

తెలంగాణలో బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని ప్రతి వేదికపైనా బీజేపీ నేతలు గట్టిగా చెబుతారు. అధికారం మాదే అంటూ బీరాలు పలుకుతారు. ఖమ్మం సభలో కేంద్ర హోంమంత్రి ప్రసంగం కూడా ఇలానే సాగింది. ఇక్కడ నుంచే అసెంబ్లీ ఎన్నికలకు సమరశంఖం పూరించారు. రైతు గోస- బీజేపీ భరోసా భారీ బహిరంగ సభకు కార్యకర్తలను తరలించడంలో బీజేపీ నేతలు సక్సెస్ అయ్యారు. ఫ్లెక్సీలు, హోర్డింగులు, కటౌట్లతో ఖమ్మం నగరం కాషాయవనాన్ని తలపించింది.


సోనియా కుటుంబం కోసం కాంగ్రెస్ పార్టీ, కల్వకుంట్ల కుటుంబం కోసం బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నాయని అమిత్ షా విమర్శలు గుప్పించారు. భద్రాచలం దక్షిణ అయోధ్యగా పేరుపొందిందని కీర్తించారు. శ్రీరామనవమికి సీఎం పట్టు వస్త్రాలు సమర్పించే సంప్రదాయాన్ని కేసీఆర్‌ విస్మరించారని విమర్శించారు. త్వరలోనే బీజేపీ సీఎం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. రైతు, దళిత, మహిళా వ్యతిరేక కేసీఆర్‌ ప్రభుత్వాన్ని సాగనంపాలని అమిత్‌ షా పిలుపునిచ్చారు. ఇలా అమిత్ షా ప్రసంగంలో ఢాంబికాలు మాత్రమే ఉన్నాయి.

తెలంగాణలో ఎన్నికలకు 3 నెలల సమయమే ఉంది. డిసెంబర్ తొలివారంలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి కేసీఆర్ ఎన్నికల రణరంగానికి సిద్ధమయ్యారు. కొత్త పథకాలు ప్రకటించి వివిధ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీసీ కులాల్లోని చేతివృత్తులవారికి రూ. లక్ష సాయం అందించే పథకాన్ని , ముస్లింలకు రూ. లక్ష సాయం చేసే స్క్రీమ్ ను ప్రారంభించారు.


నాలుగున్నర ఏళ్లుగా పెండింగ్ లోనూ ఉన్న రైత రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. విడతల వారీ నిధులు విడుదల చేస్తూ రైతులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే పూర్తైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. యువతను ఆకట్టుకునేందుకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టారు. త్వరలో టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు గులాబీ బాస్ ప్రయత్నిస్తున్నారు. ఇలా ఎన్నికల రేస్ లో టాప్ గేర్ లో కారు దూసుకుపోవాలన్న లక్ష్యంతో కేసీఆర్ కార్యాచరణ రూపొందించారు.

మరోపక్క కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకెళుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పూర్తి చేసింది. వెయ్యి మందికిపైగా ఆశావాహులు కాంగ్రెస్ టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.

అటు మేనిఫెస్టో పైనా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అనేక హామీలను ప్రకటించింది. గతేడాదే వరంగల్ సభలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారు. 4 నెలల క్రితం ప్రియాంక గాంధీ హైదరాబాద్ లో యూత్ డిక్లరేషన్ వెల్లడించారు. తాజాగా చేవెళ్ల ప్రజాగర్జన సభలో కాంగ్రెస్ పార్టీ 12 పాయింట్లతో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ను విడుదల చేసింది. కర్నాటక మాదిరే తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో కార్యాచరణ రూపొందిస్తోంది.

బీజేపీలో మాత్రం ఇంతవరకు అసెంబ్లీ అభ్యర్థుల కసరత్తు మొదలైనట్లు కనిపించడంలేదు. ఆ పార్టీకి 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఉన్నారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. మరోవైపు ప్రజలను ఆకట్టుకునేందుకు బీజేపీ ఇంతవరకు స్పష్టమైన హామీలు ఏమీ ఇవ్వలేదు. తాజాగా ఖమ్మం సభలో అమిత్ షా బీజేపీ వ్యతిరేక పార్టీలపై విమర్శలకే పరిమితమయ్యారు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అమిత్ షా విశ్వాసాన్ని ప్రకటించారు కానీ.. ఓటర్లను ఆకర్షించే అంశాలను చెప్పలేదు. కేంద్రం రైతుల కోసం చేస్తున్న కార్యక్రమాలే వివరించారు. ప్రత్యేకంగా తెలంగాణ కోసం బీజేపీ విజన్ ఏంటో ఆవిష్కరించలేకపోయారు. మొత్తంమీద కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ డీలా పడింది. ఆ విషయం తాజా సభ ద్వారా మరోసారి స్పష్టంగా తేలిపోయింది. వ్యూహం, కార్యాచరణ లేకుండా ఏదో ఒక సభ నిర్వహించారని అనిపిస్తోంది. ఇలా అయితే కారు స్పీడ్ కు బీజేపీ బ్రేకులు వేయగలదా..? కాంగ్రెస్ దూకుడును అడ్డుకోగలదా? తెలంగాణలో త్రిముఖ పోరు కాస్త ద్విముఖ పోరుగా మారుతుందా? అసలు బీజేపీ వ్యూహమేంటి?

Tags

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×