
Basara IIIT latest news(Telangana today news) : బాసర ట్రిపుల్ ఐటీ నిత్యం ఏదో ఒక వ్యవహారంలో వార్తల్లో ఉంటోంది. మొన్నటి వరకు తమ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు ఆందోళనలు చేశారు. ఆ తర్వాత విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపాయి. తాజాగా ఓ విద్యార్థి మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది. విద్యార్థి కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో విద్యార్థి పేరెంట్స్ ఆందోళనకు గురవుతున్నారు. దీంతో తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు.
బన్నీ అనే విద్యార్థి బాసర ట్రిపుల్ ఐటీలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నర్సంపల్లికి చెందిన ఆ విద్యార్థి 4 రోజుల నుంచి కనిపించడంలేదు. ఈ నెల 6న ఇంటికి వెళ్తానని చెప్పి ఔట్‌పాస్ తీసుకున్నాడు నిబంధనల మేరకు బాసర ట్రిపుల్ ఐటీ సిబ్బంది అతడికి ఔట్‌పాస్ ఇచ్చారు. అయితే బన్నీ మాత్రం ఇంటికి చేరుకోలేదు. అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది.
దీంతో కంగారు పడిన తల్లిదండ్రులు ఆదివారం హాస్టల్‌కు వచ్చి ఆరా తీశారు. తమ బిడ్డ ఆచూకీ చెప్పాలని బాసర ట్రిపుల్ ఐటీ సిబ్బందిని నిలదీశారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.
బన్నీ ఇంటికి వెళ్తుతున్నానని చెప్పి హాస్టల్ నుంచి వెళ్లాడని బాసర ట్రిపుల్ ఐటీ సిబ్బంది చెబుతున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా పంపుతారని తల్లిదండ్రులు నిలదీశారు. బన్నీ మిస్సింగ్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బన్నీ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.