
Pending bills with telangana governor(Latest news in telangana): తెలంగాణలో కొంతకాలంగా రాజభవన్ , ప్రగతి భవన్ మధ్య నిత్యం ఏదో ఒక వివాదం నడుస్తోంది. గవర్నర్ ప్రొటోకాల్ ఇష్యూతో ఈ వివాదం మొదలైంది. ఆ తర్వాత అసెంబ్లీ సెషన్ ను గవర్నర్ ప్రసంగం లేకుండా నిర్వహించడంతో గవర్నర్ తమిళిసైకి, ప్రభుత్వానికి మధ్య దూరం మరింత పెరిగింది. ఆ తర్వాత పెండింగ్ బిల్లుల అంశం దుమారం రేపింది. గవర్నర్ ఉద్దేశపూర్వకంగా బిల్లులను ఆమోదించడంలేదని మంత్రులు ఆరోపించారు.
గత బడ్జెట్ సెషన్ ముందు గవర్నర్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. అంతకుముందు సెషన్ ను తన ప్రసంగం లేకుండా నిర్వహించడంతో బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపకుండా పెండింగ్ లో ఉంచారు. దీంతో ప్రభుత్వం దిగివచ్చింది. గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సెషన్ ప్రారంభించాలని నిర్ణయించింది. అలా ఈ వివాదం ముగిసింది. అప్పటి నుంచి పెద్ద ఇష్యూలేమి రాజభవన్, ప్రగతి భవన్ మధ్య నడవలేదు.
పెండింగ్ బిల్లుల అంశం మాత్రం ఎప్పటి నుంచి వివాదాన్ని రేపుతోంది. గవర్నర్ తమ వద్ద బిల్లులను పెండింగ్ లో పెట్టారని మంత్రులు ఆరోపించారు. అభివృద్ధిని అడ్డుకునే విధంగా బిల్లులను పెండింగ్‌లో పెడుతున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లింది. బిల్లుల ఆమోదం కోసం ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
తాజాగా పెండింగ్ బిల్లులపై రాజ్‌భవన్ క్లారిటీ ఇచ్చింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వద్ద ఎలాంటి బిల్లులు పెండింగ్‌లో లేవని వివరణ ఇచ్చింది. గతంలోనే 3 బిల్లులను గవర్నర్ ఆమోదించారని స్పష్టం చేసింది. మరో 2 బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపారని తెలిపింది. మిగిలిన బిల్లులపై వివరణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి పంపామని వివరించింది.