Compulsory Retirement: స్వేచ్ఛ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగుల నిర్భంధ పదవీ విరమణపై సుప్రీం కోర్టు కీలకమైన తీర్పునిచ్చింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మన్మోహన్, జస్టిస్ చంద్రశేఖర్ తో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరిస్తూ నిర్బంధ పదవీ విరమణ ఉద్యోగికి విధించే శిక్ష కాదని స్పష్టం చేశారు. అదే సమయంలో ఉద్యోగి వ్యక్తిగత ప్రతిష్టపై పడే మచ్చ అంతకంటే కాదని స్పష్టం చేసింది. ప్రభుత్వ యంత్రాంగం పనితీరును మెరుగుపరచడం, ప్రజా ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు ఉంటాయని కోర్టు తేల్చి చెప్పింది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి సంబంధించిన ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ అంశాలను ప్రస్తావించింది. నిర్బంధ పదవీ విరమణ ఉత్తర్వు ఉద్యోగి ప్రవర్తనపై ఎలాంటి ఆరోపణలను మోపదని ధర్మాసనం పేర్కొంది. కంపల్సరీ రిటైర్ మెంట్ చేయిస్తే ఉద్యోగి దుష్ప్రవర్తనకు పాల్పడినట్టు అర్థం కాదని కోర్టు పేర్కొంది.
ప్రజా ప్రయోజనమే..
ప్రభుత్వ ఉద్యోగిని సర్వీస్ లో కొనసాగించడం వల్ల ప్రజా ప్రయోజనాలు, పరిపాలనా సామర్థ్యానికి భంగం కలుగుతుందని భావించినపుడే సంబంధిత అధికార యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ఉద్యోగికి ముందే తెలియజేయని ప్రతికూల వ్యాఖ్యలు, బెంచ్ మార్క్ కన్నా తక్కువ ఉన్న గ్రేడింగులను నిర్బంధ పదవీ విరమణ నిర్ణయం తీసుకునేటప్పుడు పరిగణనలోకి తీసుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే, ఈ నిర్ణయం కేవలం అధికారుల ఊహాగానాలు, వ్యక్తిగత ఇష్టాయిష్టాలపై ఆధారపడి తీసుకోకూడదని పేర్కొంది. ఉద్యోగి సమగ్ర సర్వీస్ రికార్డు, పనితీరు, సామర్థ్యాన్ని నిష్పాక్షికంగా అంచనా వేసి మాత్రమే నిర్ణయించాలని వ్యాఖ్యానించింది.
సమానత్వ హక్కు వర్తించదు..
‘నాతో సమానమైన రికార్డు ఉన్న ఇతర ఉద్యోగులను కొనసాగించి, నన్ను మాత్రమే రిటైర్ చేశారు’ అనే వివక్ష వాదనను కోర్టు తోసిపుచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ‘ప్రతికూల సమానత్వాన్ని’ గుర్తించదని పేర్కొంది. ఒకరికి జరిగిన పొరపాటు, మినహాయింపును మరొకరు హక్కుగా క్లెయిమ్ చేయలేరని స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకున్ననిర్ణయం పూర్తిగా ఆధారాలు లేకుండా దురుద్దేశ్యపూర్వకంగా ఉన్నపుడు లేదా తీవ్ర వివక్షతో కూడి ఉన్నపుడు మాత్రమే న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయని స్పష్టం చేసింది.
Also Read: సైబరాబాద్‌లో నీళ్ల వేస్ట్ చేస్తే భవనాల నిర్మాణాలు బంద్! సీఎంసీ కమిషనర్ వార్నింగ్