Telangana BJP: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై కొద్దిరోజులుగా సాగుతున్న ప్రచారానికి ప్రస్తుతానికి తెరపడినట్లే కనిపిస్తోంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావును మార్చబోతున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ఊహాగానాలను ఆయన సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు. వచ్చే ఏడాది జూలై వరకు ఆయనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు నాయకత్వ మార్పు ఉండే అవకాశమే లేదని స్పష్టం చేస్తున్నారు. దీంతో కొత్త అధ్యక్షుడి నియామకంపై జరుగుతున్న చర్చకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి రాంచందర్ రావు పేరు దాదాపుగా ఖరారైనట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటారని, కొత్త నాయకుడికి బాధ్యతలు అప్పగిస్తారని కొందరు భావిస్తున్నారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వస్తుందన్న అంచనాలే నాయకత్వ మార్పు ప్రచారానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.
సోషల్ మీడియా ప్రచారానికి బ్రేక్!
మరోవైపు, ఇటీవల పార్టీ పదవుల్లో కొనసాగుతున్న వారికి ఎన్నికల్లో టికెట్లు కేటాయించడం కుదరదని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునీల్ బన్సల్ స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు పార్టీ పదవులను పక్కనపెట్టి క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలు కూడా రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై ఊహాగానాలకు ఆజ్యం పోశాయి. రాంచందర్ రావు ఎమ్మెల్సీగా వెళ్లినా, ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా అధ్యక్ష పదవిని వదులుకోవాల్సి వస్తుందన్న అంచనాలతో కొత్త చీఫ్ ఎవరనే చర్చ మొదలైంది. కానీ రాంచందర్ రావు సన్నిహితులు మాత్రం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టేలా అలాంటిదేమీ ఉండదని తేల్చేయడం గమనార్హం.
పార్టీ శ్రేణుల్లో చర్చ..
బీజేపీలో సాధారణంగా రాష్ట్ర అధ్యక్షుడి పదవీకాలం మూడేళ్లు ఉంటుంది. అయితే తెలంగాణలో గతంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు రాంచందర్ రావు పదవీకాలం విషయంలో ప్రత్యేక నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తప్పించి.. కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. కొంతకాలం పాటు కిషన్ రెడ్డినే కొనసాగించిన నేపథ్యంలో రాంచందర్ రావుకు రెండేళ్ల కాలపరిమితి విధించినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన వచ్చే ఏడాది జూలై వరకు ఆయన అధ్యక్షుడిగా కొనసాగనున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే, రాజకీయ అవసరాలు, రానున్న ఎన్నికల సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైతే పదవీకాలాన్ని ఎన్నికల వరకు పొడిగించే అవకాశం కూడా ఉందని పార్టీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది.
వచ్చే జూలై వరకు రాంచందర్ రావే!
తెలంగాణలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, కేడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేయడం వంటి అంశాలు రాష్ట్ర నాయకత్వానికి కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో తరచూ అధ్యక్షుడిని మార్చడం కంటే ప్రస్తుత నాయకత్వాన్నే కొనసాగించడం పార్టీకి ప్రయోజనకరమని ఒక వర్గం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం, ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే నాయకుల ఆకాంక్షలు, సామాజిక సమీకరణాలు వంటి అంశాలు భవిష్యత్తులో నాయకత్వ మార్పుపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతానికి వచ్చే ఏడాది జూలై వరకు రాంచందర్ రావే రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతారన్నది ఆయన సన్నిహితుల వాదన. ఎన్నికల అవసరాలను బట్టి ఆ గడువును మరింత పొడిగించే అవకాశాన్ని కూడా వారు తోసిపుచ్చడం లేదు. మొత్తానికి రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంతన్నది పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉండగా, ప్రస్తుతానికి మాత్రం రాంచందర్ రావు కొనసాగింపుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
Also Read: తెలంగాణ వైద్యరంగంలో బిగ్ అప్డేట్.. ఒకేసారి 359 పీజీ సీట్లకు NMC గ్రీన్ సిగ్నల్!