PG Medical Seats: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు,టీచింగ్ హాస్పిటల్స్ కు కొండంత ఊరట లభించింది.ఏళ్ల తరబడిగా స్పెషలిస్టు డాక్టర్ల కొరతతో సతమతమవుతున్న పేద పేషెంట్లకు,నిరంతరం శ్రమిస్తున్న వైద్య సిబ్బందికి భారీ రిలీఫ్ దక్కింది.తెలంగాణలో ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేసిన అడుగులు సత్ఫలితాలనిచ్చాయి.ఈ విద్యాసంవత్సరానికి గానూ కొత్తగా 359 పీజీ (పోస్ట్ గ్రాడ్యుయేట్) సీట్లకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ ఎంసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇప్పటివరకు 1,266గా ఉన్న పీజీ సీట్ల సంఖ్య ఒక్కసారిగా 1,625కు పెరిగింది. ఫలితంగా హైదరాబాద్ లోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్ తో పాటు కొత్తగా అందుబాటులోకి వస్తున్న టిమ్స్ ఆసుపత్రుల్లో పీజీ వైద్యుల సంఖ్య పెరిగి,రౌండ్ ద క్లాక్ స్పెషాలిటీ సేవలు మరింత అడ్వాన్స్‌డ్‌గా అందుబాటులోకి రానున్నాయి. అంతేగాక తెలంగాణ ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్లకు .. స్థానిక మెడికల్ కాలేజీల్లోనే పీజీ సీట్లు లభించే ఛాన్స్ ఉన్నది.
గత ప్రభుత్వ తీరుతో పరేషాన్.. మొక్కుబడిగా ఎస్టాబ్లిష్..?
గత ప్రభుత్వం జిల్లాల్లో మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులను ఎస్టాబ్లిష్ చేసింది తప్ప..వాటికి అవసరమైన పీజీ సీట్లు,ప్రాథమిక మౌలిక వసతుల కల్పనను గాలికి వదిలేసింది.ఎన్ ఎంసీ నిబంధనల ప్రకారం పీజీ సీట్లు రావాలంటే అవసరమైన ఫాకల్టీ నియామకాలు,అత్యాధునిక ల్యాబ్‌లు, ఆసుపత్రి బెడ్స్, భవనాలను పట్టించుకోకపోవడంతో ఎన్‌ఎమ్‌సీ టీమ్‌లు తనిఖీలకు వచ్చిన ప్రతిసారీ ప్రపోజల్స్ తిరస్కరణకు గురయ్యేవి. “నామ్ వస్తే ప్రపోజల్స్ పెట్టడం.. ఆ తర్వాత పరేషాన్ కావడం” అన్నట్లుగా గత పాలకుల తీరు సాగింది. దీంతో ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు పీజీ కోర్సుల కోసం ఇతర రాష్ట్రాలకు ,ప్రైవేట్ కాలేజీలకు భారీ ఫీజులు చెల్లించి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర నేతృత్వంలోని టీమ్..ఈ సిచ్వేషన్ ను క్షుణ్ణంగా స్టడీ చేసింది. గతంలో ఉన్న లోపాలను సరిదిద్ది, ఎన్ ఎంసీ నిబంధనలకు అనుగుణంగా ఫాకల్టీ నియామకాలు వేగవంతం చేసింది. కొత్త భవనాల నిర్మాణాలు పూర్తి చేయడమే కాకుండా, ఆసుపత్రుల్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలను మెరుగుపరిచింది. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ, కేంద్రం వద్ద స్వయంగా వెంటపడి మరీ రికార్డు స్థాయిలో 359 పీజీ సీట్లను సాధించుకోవడం విశేషం.
తొలిసారిగా 13 కాలేజీల్లో పీజీ కోర్సులు..
రాష్ట్రంలో మొత్తం 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండగా, గతంలో కేవలం 10 పాత కాలేజీల్లో మాత్రమే పీజీ కోర్సులు అందుబాటులో ఉండేవి. ప్రస్తుత ప్రభుత్వ కృషి ఫలితంగా చరిత్రలో తొలిసారిగా ఒకేసారి 13 జిల్లాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పీజీ కోర్సులు ప్రారంభం కాబోతున్నాయి. నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, వనపర్తి, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, నిర్మల్, సంగారెడ్డి, నర్సంపేట కాలేజీల్లోనూ పీజీ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. అంతేగాక ఆయా దవాఖాన్లలో ఆటోమెటిక్ గా డిపార్ట్ మెంట్ల సంఖ్య కూడా పెరగనున్నది. దీంతో పీజీ కోర్సులు నిర్వహిస్తున్న ప్రభుత్వ కాలేజీల సంఖ్య 10 నుంచి 23కు పెరిగింది.
జిల్లా స్థాయిలోనే సూపర్ స్పెషాలిటీ సేవలు..
వాస్తవానికి ప్రభుత్వ ఆసుపత్రులకు పీజీ విద్యార్థులే ప్రధాన బలం. ఓపీ నుంచి ఐసీయూలో అత్యవసర వైద్యం అందించే వరకు పీజీ డాక్టర్ల పాత్ర కీలకం.ఇప్పుడు 13 జిల్లాల్లో పీజీ సీట్లు రావడంతో, ఆయా జిల్లా ఆసుపత్రుల్లో పీజీ విద్యార్థులతో పాటు వారికి మార్గదర్శనం చేసే ప్రొఫెసర్లు, స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.తద్వారా హైదరాబాద్ పై పేషెంట్ల లోడ్ తగ్గనున్నది. గుండె, మూత్రపిండాలు, నరాల వ్యాధులు,శస్త్రచికిత్సలు, గైనకాలజీ వంటి స్పెషలిస్ట్ వైద్య సేవల కోసం ఇకపై గ్రామీణ ప్రాంత ప్రజలు హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆసుపత్రులకు పరుగులు తీయాల్సిన అవసరం ఉండదు. జిల్లా కేంద్రాల్లోనే మెరుగైన వైద్యం లభిస్తుంది.
Also Read: రాహుల్ గాంధీకి నల్ల జెండాల నిరసన తప్పదు: రాంచందర్ రావు