Suryapet: స్వేచ్చ బ్యూరో: ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనలో సూర్యాపేట మున్సిపాలిటీ రాష్ట్రస్థాయిలో విశేష గౌరవాన్ని దక్కించుకుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో నిర్వహించిన వార్డు సభలో జిల్లా ఎస్పీ నరసింహ, మున్సిపల్ చైర్ పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్ష్యదితో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ ప్రగతి, పారిశుధ్యం, ఓటరు నమోదు తదితర అంశాలపై ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
సూర్యాపేటను ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా మార్చేందుకు వినూత్న ప్రయోగాలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పట్టణంలో సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాల నుండి ఇటుకలను తయారు చేస్తూ దీనిని నిరంతరం కొనసాగే ఒక స్థిరమైన వ్యవస్థగా మార్చడం శుభపరిణామమని కొనియాడారు. ప్రజల భాగస్వామ్యం, శానిటేషన్ (పారిశుధ్య) సిబ్బంది కష్టం వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆయన అభినందించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం దేశంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ చట్టం అమల్లోకి వచ్చిందని కలెక్టర్ గుర్తుచేశారు. ఈ నిబంధనల ప్రకారం తడి చెత్త మరియు పొడి చెత్తను విడివిడిగా సేకరించాలని, వీటితో పాటు శానిటరీ వేస్ట్ కూడా వేరు చేయాల్సిన అవసరం ఉందన్నారు. బయో మెడికల్ వ్యర్థాలను ప్రత్యేకంగా విభజించాలనే రూల్స్ వచ్చాయి.
ఈ నియమాలను పక్కాగా అమలు చేయడంలో సూర్యాపేట మున్సిపాలిటీ రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉందని, భవిష్యత్తులో పారిశుధ్య విభాగంలో మరిన్ని జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు సాధిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.వార్డుల్లోని ప్రతి సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ ప్రజలకు హామీ ఇచ్చారు.పట్టణంలో ఇబ్బందిగా మారిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) సమస్యపై ఆయన తీవ్రంగా స్పందించారు. సంబంధిత ఏజెన్సీ అధికారులను పిలిపించి, పనులు త్వరగా పూర్తి చేయాలని, లేదంటే కఠిన చర్యలు ఉంటాయని స్ట్రాంగ్ వార్నింగ్.ఇచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “99 రోజుల ప్రజా పాలన ప్రగతి నివేదిక” కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విస్తృతంగా చైతన్యం కల్పిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
Also read: భాగ్యనగరంలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. దంచికొడుతున్న భారీ వర్షం!
ప్రజలకు అత్యంత ఆవశ్యకమైన విద్య, వైద్యం, శాంతి భద్రతల పరిరక్షణ, మహిళా అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను అధికారులు నేరుగా గ్రామాలు, మండలాలు,మున్సిపాలిటీల్లోని ప్రజల వద్దకే తీసుకెళ్తున్నారని చెప్పారు. ప్రజలతో మమేకమై ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్లేందుకు యంత్రాంగం శ్రమిస్తోందని పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ప్రస్తుతం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అర్హత ఉన్న ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగుతోందని, ప్రజలందరూ ఈ స్పెషల్ రివిజన్‌కు పూర్తి స్థాయిలో సహకరించి తమ పేర్లను నమోదు లేదా సవరణలు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఎక్కడైనా మహిళల రక్షణకు ఇబ్బందులు ఎదురైతే పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ స్పష్టం చేశారు. మహిళల వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వరుసగా నేరాలకు పాల్పడితే అలాంటి వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేసి ప్రత్యేక నిఘా ఉంచుతామని ఆయన హెచ్చరించారు. ప్రస్తుత సమాజంలో నేరాల సంఖ్య పెరుగుతుండటమే కాకుండా, వాటి స్వరూపం కూడా మారుతోందని ఎస్పీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మహిళలను ప్రత్యక్షంగానే కాకుండా, సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా వేధింపులకు గురిచేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి సైబర్ వేధింపుల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని, పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
అనేక సందర్భాల్లో మహిళలు బయటకు వచ్చి చెప్పుకోలేని, పోలీస్ స్టేషన్లకు వెళ్లడానికి సంకోచించే పరిస్థితులు ఉంటాయని ఎస్పీ అన్నారు. ఇలాంటి వారి కోసం ప్రభుత్వం వినూత్న సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిందని వెల్లడించారు. మహిళలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా డయల్ 100లేదా 112నంబర్లకు కాల్ చేయవచ్చన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులే నేరుగా బాధితుల వద్దకు వచ్చి, అక్కడికక్కడే కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఒకవేళ పోలీసులు సకాలంలో స్పందించకపోతే, బాధితులు నేరుగా తన ఆఫీస్ కు వచ్చి కలవాలని సూచించారు. సకాలంలో స్పందించని సిబ్బందిపై కూడా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Also Read: గుండ్లపోచంపల్లిలో మహా అద్భుతం.. సిద్దిపేట బాలుడికి దక్కిన పునర్జన్మ!
మహిళల రక్షణే ధ్యేయంగా సూర్యాపేట జిల్లాలో ప్రస్తుతం రెండు షీ టీమ్స్ మరియు ఒక భరోసా సెంటర్ నిరంతరం పనిచేస్తున్నాయని ఎస్పీ తెలిపారు. ఎలాంటి అపోహలు లేకుండా, వివక్షకు లేదా వేధింపులకు గురైన మహిళలు భరోసా కేంద్రాన్ని ఆశ్రయించి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతూ, నేరస్థులకు కఠినంగా శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇంట్లో అత్తమామలు లేదా భర్త చేతిలో గృహ హింసకు, ఇబ్బందులకు గురయ్యే మహిళలు సఖి సెంటర్లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు.
జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా జిల్లాకు రెండు సఖి సెంటర్లను మంజూరు చేశారని ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సఖి కేంద్రాల్లో వచ్చే ఫిర్యాదులపై డీఎస్పీ పర్యవేక్షణలో, నైపుణ్యం కలిగిన మహిళా కౌన్సిలర్ల ద్వారా భార్యాభర్తలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. కౌన్సిలింగ్ తర్వాత కూడా ప్రవర్తన మార్చుకోని వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ నరసింహ స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ షఫీ ఉల్లా, డిఎస్పి ప్రసన్నకుమార్, తహసిల్దార్ కృష్ణయ్య, ఫ్లోర్ లీడర్ వేణుగోపాల్ రావు, వార్డ్ కౌన్సిలర్ షేక్ జహీర్, మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి డాక్టర్ అమూల్య, మున్సిపల్ కిరణ్ కుమార్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Also read: విద్యార్థులకు గుడ్ న్యూస్.. వేసవి సెలవులు పొడగింపు.. ఎప్పటివరకు అంటే?