Chairman Renewal: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ వ్యవసాయ అనుబంధశాఖల కార్పొరేషన్లలో ఇప్పుడు ‘రెన్యూవల్’ టెన్షన్ నడుస్తోంది. ఐదు కీలకమైన కార్పొరేషన్ల చైర్మన్ల పదవీకాలం ఈనెల 8వ తేదీతో ముగిసిపోతుండటంతో, ఆయా స్థానాల్లో ఉన్న నేతలు తమ కుర్చీలను కాపాడుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఈసారి ఎవరికీ పొడిగింపులు (రెన్యూవల్స్) ఇచ్చే ప్రసక్తే లేదని, కొత్త వారికి అవకాశం కల్పించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఈ మేరకు సంకేతాలు వచ్చినప్పటికీ, కొందరు చైర్మన్లు మాత్రం ఆశలు వదులుకోకుండా చివరి నిమిషం ప్రయత్నాల్లో మునిగిపోయారు.
రాష్ట్ర వ్యవసాయశాఖ పరిధిలోని కీలకమైన ఐదు అనుబంధ కార్పొరేషన్ల ఛైర్మన్ల రెండేళ్ల పదవీకాలం ఈ నెల 8వ తేదీతో ముగియనుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు రాకపోవడంతో సదరు ఛైర్మన్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సాధారణంగా గడువు ముగిసే లోపే పొడిగింపు ఉత్తర్వులు రాకపోతే, ఇక సీటు ఖాళీ అయినట్లే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి విడతలోనే ప్రాధాన్యత కల్పించామని, ఇంకా పెండింగ్‌లో ఉన్న ఇతరులకు ఈసారి అవకాశం ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. ప్రభుత్వ పెద్దలు సైతం ఈసారి పాత ముఖాలకు ‘నో’ చెప్పి, పార్టీ కోసం కష్టపడిన ఇతర సీనియర్ నేతలకు ఈ కార్పొరేషన్లలో అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. అయినప్పటికీ పదవి కోసం వారిలో ఆశలు మాత్రం పోలేదు.
Also read: Hate Speech: తెలంగాణ రాజకీయంలో కాక రేపుతున్న హేట్ స్పీచ్ సెలెక్ట్ కమిటీ.. సభ్యులు వీరే..!
పదవీకాలం ముగుస్తున్నా ఐదు వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్ల చైర్మన్లలో కొందరు నేతలు తమ కుర్చీలను కాపాడుకునేందుకు చివరి నిమిషం వ్యూహాలకు పదును పెట్టారు. ప్రస్తుతం విజయ డెయిరీ చైర్మన్ గా గుత్తా అమిత్ రెడ్డి, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గా అన్వేష్ రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ గా బాలరాజు, గిడ్డంగుల చైర్మన్ గా రాయల నాగేశ్వరరావు, ఆయిల్ ఫెడ్ చైర్మన్ గా రాఘవరెడ్డి పనిచేస్తున్నారు. వీరికి నేరుగా ముఖ్యమంత్రి నుంచి హామీ రాకపోవడంతో.. సీఎం అత్యంత సన్నిహితులు, ప్రభుత్వంలో కీలక చక్రం తిప్పుతున్న పెద్దలను ఆశ్రయిస్తున్నారు. గతంలో తాము పార్టీకి చేసిన సేవలను, నియోజకవర్గాల్లోని సమీకరణాలను వివరిస్తూ, తమకే మరో అవకాశం ఇప్పించాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. “గత రెండేళ్లలో తాము కార్పొరేషన్ అభివృద్ధికి ఎంతో కృషి చేశామని, తమకు మరో అవకాశం ఇస్తే పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేస్తామని” సదరు నేతలు సీఎం క్యాంప్ ఆఫీస్ వర్గాల వద్ద మొరపెట్టుకుంటున్నట్లు సమాచారం.
పదవీకాలం ముగుస్తున్న ఛైర్మన్ల వ్యవహారం ఇప్పుడు వ్యవసాయశాఖలో హాట్ టాపిక్‌గా మారింది. సచివాలయం నుంచి మొదలుకొని కమిషనరేట్ కార్యాలయం వరకు ఎక్కడ చూసినా వీరి గురించే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. “ఆ ఐదుగురిలో ఎవరికైనా లక్ కలిసి వస్తుందా? లేక అందరికీ ఒకేసారి చెక్ పెట్టి కొత్త టీమ్‌ను రంగంలోకి దించుతారా?” అనే కోణంలో అధికారులు, ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు. మరీ ముఖ్యంగా కొందరు ఛైర్మన్ల పనితీరుపై గతంలో వచ్చిన కొన్ని ఫిర్యాదుల నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఈసారి ప్రక్షాళనకే మొగ్గు చూపుతారనే ప్రచారం బలంగా సాగుతోంది. మరి ఈ ‘ఐదు’గురి ప్రయాస ఫలించి పదవులు దక్కుతాయో.. లేక కొత్త వారికి అదృష్టం వరిస్తుందో తెలియాలంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అటు వ్యవసాయ శాఖాధికారుల్లో, ఇటు అధికార పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Also read: Kavitha: మరోసారి బాయిబాట పట్టనున్న కల్వకుంట్ల కవిత.. నెక్ట్స్ టార్గెట్ ఈ నియోజక వర్గాలే..?