Telangana Assembly Live: వాడివేడిగా సాగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. నేడు తిరిగి ప్రారంభం కానున్నాయి. నేడు కూడా సభలో హాట్ డిబేట్ తప్పేలా కనిపించడం లేదు. ఇప్పటికే వ్యూహ, ప్రతివ్యూహాలతో అధికార, విపక్షాలు సిద్ధమయ్యాయి. నేడు తెలంగాణ అసెంబ్లీ ముందుకు ఐదు బిల్లులు రానున్నాయి. శాసనసభ, శాసనమండలి రెండూ కూడా ప్రశ్నోత్తరాలతోనే ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ పథకాల అమలు, ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. ఇక ఐదు కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ రేషనల్లైజేషన్ బిల్లును సభలో ప్రవేశపెట్టి చర్చించి ఆ తర్వాత ఆమోదం కోసం కోరనున్నారు. తెలంగాణ చారిటబుల్,హిందూ సంస్థల సవరణ బిల్లును మంత్రి కొండా సురేఖ ప్రవేశపెడతారు. ఇక పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ సవరణ బిల్లును సభలో చర్చకు పెట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వర్గీకరణ బిల్లుతో పాటు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును కూడా సభ ముందుకు తీసుకురానుంది ప్రభుత్వం.
విద్యా ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టనున్నారు. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్ల పెంపు బిల్లును కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెడతారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి.. రిజర్వేషన్ల విషయంలో ఇప్పటికే స్పష్టత ఉండడంతో ఈ బిల్లుపై ఈరోజే చర్చించి, ఆమోదించే అవకాశం కూడా తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్రాలే నిర్ణయాలు తీసుకోవచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును అమలు చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలువనుంది.
ఈ బిల్లుతో పాటు బీసీలకు స్థానిక సంస్థలతోపాటు, విద్య, ఉపాధి రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులనూ ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టి చర్చ జరపనుంది. వాటిని ఆమోదించి పార్లమెంటుకు పంపాలని.. కేంద్రం ఒప్పుకోకపోతే జాతీయ స్థాయిలో పోరాటం చేయాలని భావిస్తోంది.