AP-Telangana BJP: ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాలకు బీజేపీ రథ సారథులు వచ్చేశారు. తెలంగాణకు రామచందర్‌రావు, ఏపీకి మాధవ్ పేర్లు దాదాపు ఖరారు అయ్యాయి. ఆయా నేతలిద్దరు తమతమ రాష్ట్రాల నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. వివాదాలకు దూరంగా ఉన్నవారికి పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు.
బీజేపీ నిర్ణయాలు చాలామందికి అంతుబట్టవు. నేతలు ఒకటి భావిస్తే.. హైకమండ్ తీసుకునే నిర్ణయాలు మరోలా ఉంటాయి. మోదీ-అమిత్ షా వచ్చాక ఆ పార్టీ రూపురేఖలు మారిపోయాయి. అందరు ఊహించిన మాదిరిగానే వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తులను గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాలకు కొత్త బీజేపీ అధ్యక్షులు ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చేసింది.
ఆరు నెలలుగా వడపోసి చివరకు తెలంగాణకు బీజేపీ చీఫ్‌గా మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు పేరు ఖరారైంది. అధ్యక్షుడి పదవికి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి ఎంపిక చేసింది బీజేపీ హైకమాండ్. చివరివరకు ఈటెల, అర్వింద్ పోటీపడ్డారు.
ఆరెస్సెస్‌తోపాటు కొందరు సీనియర్లు రామచందర్‌రావు పేరు ప్రతిపాదించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధికార కాంగ్రెస్‌ను ఎదుర్కోవడం, పార్టీని బలోపేతం చేయడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కొత్త అధ్యక్షుడ్ని ఎంపిక చేసినట్టు చెబుతున్నాయి.
ALSO READ: పాశమైలారం పారిశ్రామికవాడ.. కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్
కొత్తగా ఎన్నిక కాబోయే అధ్యక్షుడు రామచందర్‌రావుకు అసలు పరీక్ష మొదలుకానుంది. బలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొని స్థానిక సంస్థల ఎన్నిక ల్లో పార్టీని గెలిపించడం ఆషామాషీ కాదని అంటున్నారు కొందరు నేతలు. కొత్త అధ్యక్షుడికి గతంలో చీఫ్‌గా పని చేసినవారు ఉండడంతో ఆయన పని మరింత తేలిక అవుతుందని అంటున్నారు.
మరోవైపు ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక దాదాపుగా ఓ కొలిక్కి వచ్చింది. మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పేరును బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గతంలో మండలి బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా పని చేసిన అనుభవం ఆయన సొంతం. గతంలో ఆయన ఆర్‌ఎస్‌ఎస్, బీజేవైఎంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
మాధవ్ ఎవరోకాదు బీజేపీ సీనియర్ నేత, దివంగత చలపతిరావు కుమారుడు. చలపతిరావు రెండుసార్లు ఎమ్మెల్సీగా పని చేశారు. వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి కావడం, ఆర్ఎస్‌ఎస్ బ్యాక్‌గ్రౌండ్ ఉండడంతో మాధవ్‌కు కలిసి వచ్చిందని అంటున్నారు. ఏపీలో కూడా స్థానిక సంస్థలకు మరో ఆరునెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. కూటమి అధికారంలోకి ఉండడంతో మాధవ్‌కు కలిసి రావచ్చని అంటున్నారు.