Women Welfare Scheme: తెలంగాణ బడ్జెట్‌లో విత్త మంత్రి భట్టి విక్రమార్క మహిళలకు పెద్ద పీఠ వేశారు. మహిళా స్రీ శిశు సంక్షేమానికి నిధులు భారీగా కేటాయించారు. దాదాపు 2,862 కోట్ల రూపాయలు కేటాయించినట్టు చెప్పుకొచ్చారు. ఇది కేవలం ఆ శాఖకు సంబంధించినది మాత్రమే. ఇదికాకుండా స్కీమ్‌లు ఇలా చూసుకుంటే చాలానే ఉన్నాయి. ఒకవిధంగా చెప్పాలంటే మహిళలకు వరాల జల్లు అన్నమాట.
మహిళలే మహరాణులు అన్న పదాన్ని తన బడ్జెట్ ప్రసంగంలో పదే పదే గుర్తు చేశారు ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క. మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు ఇలా ఏ పథకం చూసినా మహిళల పేరు మీద ఉన్నాయి. ఆడ బిడ్డలు పని వెళ్లాలన్నా, చదువుకు వెళ్లాలన్నా, దేవాలయానికి వెళ్లి ముక్కులు తీర్చుకోవాలన్నా ఇబ్బందులు పడకుండా ప్రవేశపెట్టిన పథకం మహాలక్ష్మి స్కీమ్.
మహాలక్షి గేమ్ ఛేంజర్ ఎందుకంటే
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రమాణ స్వీకారం తర్వాత అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ స్కీమ్ గురించి ప్రకటన చేశారు. అప్పటి నుంచి నిరంతరాయంగా కొనసాగుతూ వస్తోంది. 2023 డిసెంబర్ 9న ప్రారంభించిన ఈ పథకం, రాష్ట్రంలోని మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది రేవంత్ ప్రభుత్వం.
ఇప్పటివరకు 7,227 బస్సుల్లో 149.63 కోట్ల మంది ఉచితంగా ప్రయాణం చేశారన్నారు. దీని ద్వారా రూ. 5,005.95 కోట్లు మహిళలకు ఆదా అయ్యింది. ప్రారంభ దశలో సాధారణ బస్సుల్లో 69 శాతంగా ఉన్న ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో ఆ తర్వాత 94 శాతానికి పెరిగింది. ఈ విషయాన్ని తన బడ్జెట్‌లో వివరించారు సదరు మంత్రి.
ALSO READ: బడ్జెట్ లో ఏయే శాఖలకు ఎంత కేటాయించారంటే
మహాలక్ష్మి ప్రత్యేక బస్సుల్లో ఈ రేషియో 100 శాతం నమోదవుతుందని వివరించారు మంత్రి. దీనివల్ల ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి మెరుగు పడిందని తెలిపారు. బస్సుల సంఖ్యను పెంచడమే కాకుండా 6,400 మంది ఉద్యోగులను ఇప్పటికే అదనంగా నియమించడం జరిగిందన్నారు. ఈ పథకానికి ప్రభుత్వం క్రమం తప్పకుండా ఆర్టీసీకి నిధులు చెల్లిస్తూ వస్తోందన్నారు.
మహాలక్ష్మి పథకంలో భాగమైన మహిళలకు గ్యాస్ సిలిండర్ ను రూ. 500లకే పంపిణీ చేస్తోంది. దీని ద్వారా దాదాపు 43 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరింది. లబ్ది దారులు ఉపయోగించిన సిలిండర్లను సబ్సిడీ కింద ప్రభుత్వం రూ.433. 20 కోట్లు చెల్లించింది. ఇక గృహజ్యోతి విషయానికొద్దాం.
గ్యాస్, విద్యుత్ ఇలా ఏది చూసినా
ఈ పథకం కింద 200 యూనిట్లు లోబడి విద్యుత్ వినియోగిస్తున్న వారికి ఉచితంగా విద్యుత్ ఇస్తోంది. ఇప్పటివరకు రూ.1775. 15 కోట్ల విద్యుత్ సంస్థలకు సబ్సిడీగా ప్రభుత్వం చెల్లింది. ఇందులో మరో పథకం. ఇందిరమ్మ ఇళ్లు. గతేడాది మార్చి నెలలో ప్రారంభించింది. ఆడబిడ్డల పేరుతో ఇళ్ల పట్టాలను ఇవ్వాలని నిర్ణయించింది. రూ.22,500 కోట్లతో ప్రతి నియోజకవర్గంలో కనీసం 3,500 చొప్పున ఇళ్లను మంజూరు చేస్తున్నారు.
ఇళ్ల విషయంలో గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇస్తామని ఆశపెట్టింది. ఈ విషయంలో లబ్దిదారులకు నిరాశే మిగిలింది. అయితే అసంపూర్తిగా నిలిచిపోయిన 34,545 ఇళ్లను అందుబాటులో తీసుకురానుంది. ఇందుకోసం రూ. 305.03 కోట్లు కేటాయిస్తున్నట్లు విత్త మంత్రి ప్రకటించారు.
ఇది కాకుండా ఓఆర్ఆర్ కు అనుకుని నగరం నలువైపులా టౌన్ షిప్ లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అల్పాదాయ, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండేలా గృహాలను నిర్మించే ప్రణాళికను రెడీ చేస్తున్నట్లు బడ్జెట్ లో ప్రస్తావించారు ఆర్థికమంత్రి.