తెలంగాణ కేబినెట్ సమావేశం సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో ఈ సమావేశం నిర్వహిస్తారు. తెలంగాణలో ఎన్నికలకు మరో 4 నెలల సమయం మాత్రమే ఉంది. అక్టోబర్ లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ పలు ముఖ్యమైన అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. అలాగే కీలక నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం.
ప్రస్తుతం రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు, పెండింగ్ పనులపై కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దాదాపు 50 అంశాలపై ప్రధానంగా చర్చిస్తారని సమాచారం. అన్ని శాఖల ఉన్నతాధికారులు తమ శాఖల్లో పెండింగ్, అభివృద్ధి పనులపై ఇప్పటికే నివేదికలు రూపొందించారు. ఆ నివేదికలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించారు.
తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల వాటిల్లిన నష్టంపై సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. వరద నీటిలో మునిగిన గ్రామాలు, బాధితులకు పునరావాసం, వ్యవసాయ పనుల పునరుద్ధరణకు చేపట్టాల్సిన చర్యలపైనా కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. పంట రుణాల మాఫీ, ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ అమలు, ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల పెంపు, దళితబంధు రెండోవిడత, గృహలక్ష్మి, బీసీలు, మైనారిటీలకు రూ.లక్ష ఆర్థికసాయం ఇలాంటి అంశాలను కేబినెట్ లో చర్చిస్తారని తెలుస్తోంది.
ఆగస్టు 3న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో సభలో ప్రవేశపెట్టే బిల్లులపైనా కేబినెట్ లో చర్చించనున్నారు.