Jubilee Hills Bypoll: తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ బైపోల్.. అనూహ్యమైన రాజకీయ వేడి.. గెలుపు మాదంటే మాది.. వంద శాతం మేమే గెలుస్తాం.. ప్రజలకు మా వైపే ఉన్నారు.. ప్రజలకు మాకే ఓట్లు గట్టిగా గుద్దుతారు.. ఇలా చెప్పుకుంటూ పార్టీలు గట్టిగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరిందని చెప్పవచ్చు. అయితే త్రిముఖ పోరులో బీజేపీ మాత్రం సైలెంట్‌గా కనిపిస్తోంది.. ఈ ఎన్నికల్లో బీజేపీ హవా పెద్దగా కనిపించడం లేదు. ప్రధాన పోటీ మాత్రం బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్యే నెలకొందని టాక్ అయితే ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఈ ఎన్నికలను నిశితంగా పరిశీలిస్తే.. బీఆర్‌ఎస్ పార్టీ వ్యూహం పూర్తిగా డిఫెన్స్ మోడ్ లోకి మారిపోయిందనే రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
⦿ స్థానికత నినాదంతో దూసుకుపోతున్న నవీన్ యాదవ్..
బీఆర్‌ఎస్ దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ తమ వైపు ప్రజలు ఎక్కువగా సానుభూతి చూపుతారనే నమ్మకం పెట్టుకుంది. అయితే.. కేవలం సానుభూతి పైనే ఆధారపడకుండా.. బీఆర్‌ఎస్ నాయకత్వం తమ ప్రచారంలో ప్రధానంగా ‘నకిలీ ఓట్లు’ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అధికారులు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారనే మాటలకు బీఆర్ఎస్ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఓవైపు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్థానిక నినాదంతో దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ మాత్రం ఎలాంటి ఎదురుదాడి చేయకుండా.. తమ ఓటమి భయాన్ని సూచించే విధంగా ముందస్తు ఆరోపణల వ్యూహాన్ని అమలు చేస్తున్నదని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
⦿ అసలు నకిలీ ఓట్ల మ్యాటర్ నిజమేనా..?
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో వేలాది నకిలీ ఓట్లు చేర్చారని, ఎన్నికల అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు 20వేల అక్రమ ఓట్లు చేర్చారంటూ బీఆర్ఎస్ నేతలతో కలిసి కేటీఆర్ నేరుగా సీఈఓకు ఫిర్యాదు కూడా చేశారు. దీనికి రుజువుగా.. ఒకే ఇంట్లో 43 ఓట్లు ఉన్నాయని, అవన్నీ దొంగ ఓట్లేనని ఆయన చూపించారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం… ఎన్నికలకు ముందే ఇలాంటి ఆరోపణలు చేయడం అనేది.. సాధారణంగా ఆ పార్టీలో నెలకొన్న ‘ఓటమి భయాన్ని’ చూపిస్తోందని అంటున్నారు. గెలుపుపై పూర్తి నమ్మకం ఉన్న పార్టీలు తమ అభివృద్ధి ఎజెండాపై, భవిష్యత్తు ప్రణాళికలపైనే దృష్టి పెడతాయి తప్ప.. ఇలా నకిలీ ఓట్లు, అధికారుల పక్షపాతం వంటి అంశాలపై ప్రచారం చేయవు.
⦿ సన్నగిల్లిన బీఆర్ఎస్ వ్యూహం
కేటీఆర్ ఈ ‘నకిలీ ఓట్ల’ ఆరోపణను దేశంలోని కాంగ్రెస్ అగ్రనేతపై ప్రయోగించిన రాజకీయ అస్త్రంగా కూడా భావించవచ్చు. బీహార్‌లో ‘ఓట్ల చోరీ’ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ తెలంగాణలో తమ పార్టీయే ఓట్ల అక్రమాలకు పాల్పడుతుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు.. అసలు కేటీఆర్ మాటల్లో నిజం లేదని ఎన్నికల సంఘం రియాక్ట్ అయ్యింది. కేటీఆర్ చేసిన 43 ఓట్ల ఆరోపణపై ఎన్నికల సంఘం స్పందించి, ఆ ఇంటిని బహుళ అంతస్తుల భవనంగా తేల్చిచెప్పింది. ఆయన ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేసింది. దీంతో బీఆర్‌ఎస్ వ్యూహం కాస్త వెనకబడినట్లయింది.
⦿ బీఆర్ఎస్‌లో స్పష్టంగా కనిపిస్తున్న డిఫెన్సివ్ వైఖరి..
బీఆర్‌ఎస్ పార్టీ ప్రచారం తీరులో డిఫెన్సివ్ వైఖరి స్పష్టంగా కనిపిస్తుంది. సహజంగా ఎన్నికల ప్రచారంలో.. పార్టీలు తాము గెలిస్తే నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తాయి..? ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తాం..? అని అంశాలను ఓటర్లకు వివరిస్తాయి. కానీ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తమ అభ్యర్థి గెలిస్తే చేయబోయే పనుల గురించి పెద్దగా ప్రస్తావించడం లేదు. దీనికి బదులుగా.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిస్తే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపిన హైడ్రా జూబ్లీహిల్స్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపడుతుందని ఓటర్లను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. దీంతో బీఆర్ఎస్ లో పెద్దగా పస లేదని జనాలకు సైతం అర్థమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
⦿ బీఆర్ఎస్ తీరు ఎలా ఉందంటే..?
బీఆర్ఎస్ తీరు ఎలా ఉందంటే.. తమ పార్టీకి ఓటు వేయమని అడగడం కంటే.. కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దని ఓటర్లను కోరడం లాంటిదే.. ఈ రకమైన వ్యతిరేక ప్రచారంతొ బీఆర్‌ఎస్ బలహీనతలు స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా జాతీయ రాజకీయ అంశాల కంటే స్థానిక సమస్యలపై మాట్లాడాల్సిన చోట.. డిఫెన్స్ మోడ్‌లోకి వెళ్లిపోయిందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఓటమి భయం ఉన్నప్పుడే.. ఇలా ప్రత్యర్థిని బూచిగా చూపి ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నించడం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
⦿ వీటిపైనే ఆధారపడిన బీఆర్ఎస్..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ పూర్తిగా సానుభూతి, ఆరోపణలు, భయపెట్టే ప్రచారాలు చేయడంపైనే ఆధారపడి ఉంది. ఈ డిఫెన్సివ్ వైఖరి, అభివృద్ధి ఎజెండా కరువవడం, ఫేక్ ఓట్ల ఆరోపణకు ఎన్నికల సంఘం నుండి వచ్చిన ఎదురుదెబ్బ.. ఇవన్నీ కలిసి బీఆర్‌ఎస్‌లోని ఓటమి భయాన్ని బహిరంగంగా ప్రదర్శిస్తున్నాయన్న విశ్లేషణలకు బలం చేకూరుస్తున్నాయి. ఎన్నికల ఫలితం ఎలా ఉన్నా.. బీఆర్‌ఎస్ అనుసరిస్తున్న ఈ డిఫెన్సివ్ వ్యూహం మాత్రం అటు రాజకీయ పరిశీలకులకు, ఇటు ప్రజలకు ఈజీగా అర్థం అవుతోంది..
ALSO READ: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు.. నవీన్ యాదవ్ గెలుపు శాతమెంత..?