Telangana CM revanth: సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన అనగానే, బీఆర్ఎస్ మాత్రం పెట్టుబడులు లేవు.. జస్ట్ షికారు మాత్రమే అంటూ ఊదర గొట్టింది. పెట్టుబడుల రాక అనేదే ఉండదని, జస్ట్ పర్యటన సాఫీగా సాగుతుందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ తరుణంలో విమర్శలకు సరైన సమాధానమిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మనం ఒకటి తలిస్తే, దేవుడు ఒకటి చేస్తాడంటే ఇదే అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. తెలంగాణకు భారీ పెట్టుబడుల సాధనకు సీఎం వేసిన రెండో అడుగు విజయవంతమైంది. ఆ జిల్లాకు పెట్టుబడుల రాకతో ఉపాధికి కొదువ ఉండదని చెప్పవచ్చు.
దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు లు మంగళవారం యూనిలీవర్ సీఈవో హీన్ షూమేకర్ తో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను సీఎంతో పాటు దావోస్ వెళ్లిన బృందం వివరించింది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ప్రవేశం ద్వారంలా ఉంటుందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులతో యువతకు ఉపాధి లభిస్తుందని, అలాగే సంస్థ కూడ వృద్ధి చెందుతుందని వివరించారు.
దీనితో తెలంగాణలో యూనిలీవర్ సంస్థ వ్యాపార అవకాశాల గురించి పూర్తిగా చర్చించిన అనంతరం పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత చెప్పింది. యూనిలీవర్ సంస్థ భారతదేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టినా, ఇప్పటివరకు తెలంగాణలో ఆ సంస్థ ఊసే లేదు. తొలిసారి రాష్ట్రంలో ఒకటి కాదు ఏకంగా రెండు యూనిట్స్ ఏర్పాటుకు యునిలీవర్ ఆమోదం తెలపడం విశేషం.
సీఎంతో భేటీ అనంతరం కామారెడ్డి జిల్లాలో యునిలీవర్ సంస్థ పామాయిల్ శుద్ధి యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపింది. అలాగే బాటిల్ క్యాప్ లను ఉత్పత్తి చేయడానికి కూడా కొత్త తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు యునిలీవర్ సీఈవో హీన్ షూమేకర్ అంగీకరించారు. సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి తెలుసుకున్న సీఈవో హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఐటీ&ఐసీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎంఓ ప్రధాన కార్యదర్శి శేషాద్రి, ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read: Telangana Govt: తెలంగాణలో జీతాల పెంపు.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
ఇక,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ రెండో రోజున వరుసగా వివిధ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు సాంబానోవా కంపెనీ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ సూ లే తో చర్చలు జరిపారు. ప్రధానంగా తెలంగాణలో సెమీ కండక్టర్ పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. కాలిఫోర్నియాకు చెందిన సాంబనోవా అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ. ఏఐ హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ అందించటంలో పేరొందిన సంస్థతో జరిగిన చర్చలు సానుకూలంగా ముగిశాయి.