
CM Revanth Reddy Speech In Assembly Session: తెలంగాణ తల్లి అంటే ధీశాలి.. పోరాట శక్తిగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ తల్లిని చూస్తే అమ్మ, అక్క, చెల్లి గుర్తుకు రావాలన్నారు. తెలంగాణ ఆడబిడ్డలు కిరీటాలు పెట్టుకుని ఉండలేదన్నారు. తెలంగాణ తల్లి శ్రమజీవికి ప్రతీకగా ఉండాలని స్పష్టంచేశారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాజరిక ఆనవాళ్లు ఉన్నాయని.. ప్రజాస్వామ్య పాలనలో రాజరికం ఉండకూడదని భావిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు.
అసెంబ్లీలో మాట్లాడుతూ సీఎం.. తెలంగాణ ఉద్యమ సమయంలో అందరూ టీజీ అని రాసుకునేవాళ్లమని గుర్తుచేశారు. కేంద్రం కూడా నోటిఫికేషన్ లో టీజీ అని పేర్కొందన్నారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా గత ప్రభుత్వం వాళ్ల పార్టీ పేరు స్ఫరించేలా టీఎస్ అని పెట్టిందని ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తాము టీజీగా మార్చామన్నారు. జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా ప్రకటించామన్నారు. ఆనాటి పాలకులు కుట్ర పూరితంగా జయ జయహే తెలంగాణ గీతాన్ని నిషేధించినంత పనిచేశారన్నారు.
ప్రతిపక్ష పాత్ర పోషించాలని బీఆర్ఎస్ ప్రజలు మరో అవకాశం ఇచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష నాయకుని కుర్చీ ఖాళీగా ఉండటం మంచిదికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దివాలా తీస్తే బాగుండని బీఆర్ఎస్ కోరుకుంటోందని మండిపడ్డారు. విపక్ష సభ్యులు నిర్మాణాత్మక సూచనలు చేయాలని కానీ ఆవిధంగా జరగడంలేదన్నారు.
ఒకటో తేదీనే ఉద్యోగులు జీతాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో తమ పథకాలు అమలు చేసి 60 రోజులు పూర్తైందని పేర్కొన్నారు. రైతు బంధు ఇవ్వడంలేదని రైతులను రెచ్చగొడుతున్నారని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వల్ల దేవాలయాల ఆదాయం పెరిగిందని వెల్లడించారు. సింగరేణి కార్మికుల బాబోగులు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. త్వరలో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. వయోపరిమితిని 46 ఏళ్లు పెంచుతున్న తెలిపారు. 15 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసంబ్లీలో ప్రకటించారు.