Congress Reaction On Kavitha Arrest(Latest political news telangana): బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతారని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బాగా ప్రచారం జరిగింది. ఆ సమయంలోనే ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమెకు అనేక సార్లు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఢిల్లీలో విచారణకు పిలిచింది.
కవిత హస్తినకు వెళ్లి ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఆ సమయంలో కవిత ఫోన్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. అలాగే కవిత అరెస్ట్ ఖాయమని బీజేపీ నేతలు పదేపదే చెప్పుకొచ్చారు. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఆ వేడి చల్లారిపోయింది. కవితను ఈడీ అరెస్ట్ చేయలేదు. ఆ తర్వాత నోటీసులు కూడా ఇవ్వలేదు.
సరిగ్గా సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకావడానికి ఒక్కరోజు ముందు కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే సమయంలో కవిత నివాసంలో ఈడీ ఎందుకు సోదాలు చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. కవిత అరెస్ట్ అవుతారంటూ గతంలో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు.
బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. ఈ రెండు పార్టీల నేతలు గల్లీలో కొట్టుకుంటారు.. ఢిల్లీలో దోస్తీ చేస్తారని మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో లబ్ధికోసమే కవిత అరెస్ట్ వ్యవహారం నడుస్తోందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. అందుకే ఎన్నికల ముందు ఇప్పుడు ఈడీ కవిత ఇంట్లో సోదాలు చేసిందన్నారు.
Also Read: ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్
కవిత అరెస్టైన కాసేపటికే ప్రధాని హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. మీర్జాలగూడ నుంచి మల్కాజ్ గిరి క్రాస్ రోడ్డు వరకు ఈ రోడ్ షో సాగింది. అటు కవిత అరెస్ట్ .. ఇటు మోదీ రోడ్ షో.. తో హైదరాబాద్ లో పొలిటికల్ హీట్ పెరిగింది.