Godavari Water: ఎల్ నినో ప్రభావంతో ప్రత్యేక వాతావరణ పరిస్థితులు, ప్రకృతి విపత్తులు ఏర్పడుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద గోదావరి జలాల నిల్వ కోసం చేపడుతున్న తాత్కాలిక ఎత్తు పెంపు పనులను మంత్రి తుమ్మల పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే మూడు లేయర్లు ఇసుక బస్తాలు ఏర్పాటు చేశామని, మరో రెండు మూడు లేయర్లు ఇసుక బస్తాలు దుమ్ముగూడెం ఆనకట్ట పై మీటర్ ఎత్తున ఇసుక బస్తాలు ఏర్పాటు చేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో గేట్లు మూసి నీటి నిల్వ చేసే అవకాశం లేదని, సమ్మక్క సాగర్ బ్యారేజ్ వద్ద మాత్రమే నీటి నిల్వకు అవకాశం ఉందన్నారు. తాగు నీటికి ఎద్దడి లేకుండా నీటి నిల్వ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిషన్ భగీరథ నీటి సరఫరా ఇబ్బంది లేకుండా నీటి నిల్వ చేయలనే సంకల్పంతో పనులు జరుగుతు న్నాయన్నారు.
Also read: కేంద్ర కేబినెట్ ప్రక్షాళన తప్పదా.. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే భేటీపై ఉత్కంఠ!
రాబోయే వేసవిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పట్టణాలు, గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా నిరంతర తాగునీటి సరఫరా అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. పరిస్థితులకు అనుగుణంగా నీటి నిల్వ, వినియోగంపై అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు.
గతంలో మాదిరిగా ప్రస్తుతం గోదావరి నదిలో నీటి ప్రవాహం ఉండటం లేదు. సీతమ్మ సాగర్ నిర్మాణం పూర్తికానందున ఆనకట్ట ఎత్తు పెంపు ద్వారా రాబోయే రోజుల్లో నీటి లభ్యతపై ముందస్తు ప్రణాళిక అవసరం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే గోదావరి జలాలను నిల్వ చేస్తున్నాం.సీతమ్మసాగర్ ప్రాజెక్టు పూర్తయితే 36 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పాటు 350 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంటుంది. సీతమ్మసాగర్ నిర్మాణం ఇంకా పూర్తికాని కారణంగా ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల్లో దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద తాత్కాలికంగా ఎత్తు పెంచి సుమారు ఒక టీఎంసీ నీటిని నిల్వ చేయాలన్నది లక్ష్యంగా చేసుకుని పనులు పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
Also read: కేంద్ర కేబినెట్ ప్రక్షాళన తప్పదా.. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే భేటీపై ఉత్కంఠ!