Labour Insurance: కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకం కొందరికి అక్రమ సంపాదన మార్గంగా మారిందనే ఆరోపణలు సిరిసిల్ల జిల్లాలో కలకలం రేపుతున్నాయి. మరణించిన కార్మికుల పేర్లతో లేబర్ కార్డులు సృష్టించి, నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాల ఆధారంగా బీమా పరిహారాన్ని కాజేస్తున్నారంటూ బోయినపల్లి మండలం నీలోజిపల్లి గ్రామానికి చెందిన బాధితులు సంచలన ఆరోపణలు చేశారు. కార్మిక శాఖలోని ఓ అధికారి, దళారులు కుమ్మక్కై ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని, అసలు నామినీలకు అందాల్సిన బీమా సొమ్మును పక్కదారి పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బాధితుడు శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. తన మామ దాకూరి మల్లారెడ్డి 2019 ఆగస్టు 14న రామన్నపేటలోని వ్యవసాయ పొలం వద్ద విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం గ్రామపంచాయతీ నుంచి మరణ ధ్రువీకరణ పత్రం కూడా పొందినట్లు తెలిపారు. కొద్దిరోజుల తర్వాత కోదురుపాకకు చెందిన ఓ వ్యక్తి తనకు కార్మిక శాఖలో పరిచయాలు ఉన్నాయని, లేబర్ కార్డు ద్వారా రూ.6.30 లక్షల బీమా పరిహారం ఇప్పిస్తానని నమ్మించి అవసరమైన పత్రాలు తీసుకెళ్లినట్లు వెల్లడించారు. అయితే, ఈ వ్యవహారంపై ఆరా తీయగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. 2019లోనే మరణించిన తన మామ పేరుతో 2020లో లేబర్ కార్డు రిజిస్ట్రేషన్ చేసి, 2022లో కరీంనగర్ సివిల్ ఆసుపత్రిలో మరణించినట్లు మరో డెత్ సర్టిఫికెట్ సృష్టించి బీమా సొమ్ము డ్రా చేసినట్లు ఆరోపించారు. దీనిపై సిరిసిల్ల ఇన్‌ఛార్జి ఏఎల్వో కృష్ణసాగర్‌ను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని, సంబంధిత దళారి సైతం బెదిరింపులకు పాల్పడ్డారని శ్రీనివాస్ ఆరోపించారు.
తనకు జరిగిన అన్యాయంపై కరీంనగర్, వరంగల్ ఉన్నతాధికారులతో పాటు హైదరాబాద్‌లోని కార్మిక శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు శ్రీనివాస్ తెలిపారు. ఈ ఫిర్యాదుపై విచారణకు ఆదేశాలు వచ్చిన అనంతరం ఇన్‌ఛార్జి ఏఎల్వో కృష్ణసాగర్ తమ అత్తగారి ఇంటికి వెళ్లి, ఇంట్లో పురుషులు లేని సమయంలో తెల్ల కాగితాలపై సంతకాలు చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీస్ హెల్ప్‌లైన్ 100కు ఫోన్ చేయడంతో పాటు బోయినపల్లి పోలీస్ స్టేషన్, జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లోనూ ఫిర్యాదులు చేసినట్లు వెల్లడించారు. తమకు న్యాయం చేయాల్సిన అధికారులే ఒత్తిళ్లకు పాల్పడుతున్నారంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
మరో బాధితుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. తన అక్క కూస లక్ష్మి 2019 నవంబర్ 26న వెంకట్రావుపల్లిలో టీబీ వ్యాధితో మృతి చెందినట్లు తెలిపారు. లేబర్ కార్డు ద్వారా బీమా డబ్బులు ఇప్పిస్తానని మైలారం శ్రీనివాస్ అనే దళారి ఆమె డెత్ సర్టిఫికెట్, ఆధార్ కార్డులను తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అయితే ఐదేళ్లు గడిచినా పరిహారం అందకపోవడంతో ఆరా తీయగా, 2022లో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించి తమకు రావాల్సిన రూ.1.30 లక్షల బీమా సొమ్మును కాజేసినట్లు తెలిసిందని ఆరోపించారు. తమ కుటుంబానికి అందాల్సిన పరిహారం ఇతరుల చేతుల్లోకి వెళ్లడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో అమాయక కార్మికుల కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని ఆధార్ కార్డులు, మరణ ధ్రువీకరణ పత్రాలు సేకరిస్తూ ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని బాధితులు కోరారు. జిల్లావ్యాప్తంగా లేబర్ కార్డుల ద్వారా మంజూరైన బీమా క్లెయిమ్‌లపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మరణించిన వారి పేర్లతో జరిగిన కార్డు రిజిస్ట్రేషన్లు, జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రాలు, బీమా క్లెయిమ్‌ల మంజూరు, చెల్లింపుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయనే ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీసి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తమకు రావాల్సిన బీమా పరిహారాన్ని అందించి న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
Also Read: టీమిండియా చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ కు బంపర్ ఆఫర్