Bandi Sanjay: తెలంగాణ రాజకీయాల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. విపక్షాల విమర్శలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పదవుల గౌరవం (డిగ్నిటీ ఆఫ్ ఆఫీస్) గురించి మాట్లాడే నైతిక హక్కు ప్రత్యర్థులకు లేదని మండిపడ్డారు. ఒకవైపు బీఆర్ఎస్ గత పాలనను ఎండగడుతూనే, మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
అదేనా డిగ్నిటీ ఆఫ్ ఆఫీస్?
గత బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై బండి సంజయ్ నిప్పులు చెరిగారు. ‘రాష్ట్రాన్ని దోచుకోవడమే డిగ్నిటీ ఆఫ్ ఆఫీసా? కనీస విలువలు లేకుండా భార్యాభర్తల బెడ్రూం సంభాషణలను కూడా దొంగచాటుగా వినడమేనా పదవికి ఇచ్చే గౌరవం?’ అని సూటిగా ప్రశ్నించారు. ఇంటర్ విద్యార్థులు, ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసి ఆత్మహత్యలకు కారణమవడం, చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా సర్పంచులు, కాంట్రాక్టర్లను ఆత్మహత్యల పాలు చేయడం ఏ రకమైన గౌరవమో చెప్పాలని నిలదీశారు. తెలంగాణ ప్రజలకు ‘డిగ్నిటీ ఆఫ్ ఆఫీస్’ అంటే ఏంటో బాగా తెలుసని, అందుకే గత ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఫాంహౌజ్‌కే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు.
గురువుల కాళ్లు మొక్కడం మా సంస్కారం
తనపై వస్తున్న వ్యక్తిగత విమర్శలకు బండి సంజయ్ ఘాటుగా బదులిచ్చారు. ‘నేను బరాబర్ మా గురువుల కాళ్లు మొక్కుతాను. అది మా సంస్కారం. అంతేకానీ మీ లెక్క చెప్పులు ఎత్తుకుపోయే వాణ్ని కాదు’ అంటూ విరుచుకుపడ్డారు. తమ గురువులు తమకు మంచి విలువలు నేర్పించారని, ప్రత్యర్థుల మాదిరిగా మంది కొంపలు ముంచే సంస్కృతి తమది కాదని స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ చెల్లని రూపాయి
ఇదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపైనా బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ ఒక ‘చెల్లని రూపాయి’ అని అభివర్ణించిన ఆయన, విదేశాల్లోని చెల్లని రూపాయలను ఇక్కడికి తీసుకొచ్చి సమ్మిట్‌లు పెడితే ఒరిగేదేమీ లేదని విమర్శించారు. రాహుల్ గాంధీకి దేశ ప్రధాని అయ్యే అర్హత ఏమాత్రం లేదని, పొరపాటున ఆయన పీఎం అయితే దేశం ముక్కలవడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read: సీబీఐ అధికారుల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్.. ఐదుగురి అరెస్టు