Telangana Government: రాష్ట్రంలో ఎల్ నినో (El Nino) ప్రభావాన్ని తట్టుకునేందుకు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ నినో వల్ల తలెత్తే తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా మండల స్థాయిలో ప్రత్యేక సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా జీవో ఆర్.టి. నెం. 579 (G.O.Rt. No. 579) ని విడుదల చేసింది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ప్రతి మండలంలోనూ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) అధ్యక్షతన ఈ సమన్వయ కమిటీలు పనిచేయనున్నాయి. ఇందులో వివిధ శాఖల అధికారులు సభ్యులుగా ఉండనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాలకు తగిన ఉపాధి కల్పించడం, తాగునీటి సమస్య రాకుండా, పశుగ్రాసం కొరత లేకుండా చూడటం ఈ కమిటీల ప్రధాన బాధ్యత.
ఎల్ నినో వల్ల తీవ్ర పశుగ్రాస కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నందున ముందస్తు జాగ్రత్తగా రాష్ట్రంలోని 35,959 చిన్న నీటిపారుదల చెరువుల పరిధిలో పశుగ్రాసం సాగుకు అనువైన స్థలాలను ఈ కమిటీలు గుర్తించనున్నాయి. మహిళా స్వయం సహాయక సంఘాల (SHGs) భాగస్వామ్యంతో పశుగ్రాస సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనివల్ల పశువులకు గ్రాసం దొరకడమే కాకుండా మహిళలకు అదనపు ఆదాయం కూడా లభించనుంది.
పశువుల దాహార్తిని తీర్చేందుకు కొత్త నీటి తొట్టెల నిర్మాణం చేపట్టడంతో పాటు, ప్రస్తుతం వినియోగంలో లేని లేదా పాడైపోయిన నీటి తొట్టెలకు తక్షణమే మరమ్మతులు చేపట్టనున్నారు. అంతేకాకుండా నీటి నిల్వలను పెంచేందుకు వ్యవసాయ కుంటలు, చెక్‌డ్యామ్‌లు, బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాల ద్వారా భూగర్భ జలాల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
కేవలం నీరు, గ్రాసమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై కూడా ఈ కమిటీలు దృష్టి సారిస్తాయి. గ్రామీణ రహదారులు, కల్వర్టులు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామపంచాయతీ భవనాలు, పశువుల షెడ్ల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో అత్యవసరంగా చేపట్టాల్సిన పనులను గుర్తించి, ‘వికసిత్ గ్రామ పంచాయతీ’ ప్రణాళికలను రూపొందించనున్నారు.
Also Read: రోజుకు రూ.200 పొదుపు చేస్తే చాలు.. చేతికి రూ.20 లక్షలు.. ఈ SIP లెక్కలు చూడండి!
ఈ పనుల అమల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా మండల సమన్వయ కమిటీలు వారానికి కనీసం ఒకసారైనా సమావేశమై, చేపట్టిన పనుల పురోగతిపై సమీక్ష జరపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆయా సమీక్షలకు సంబంధించిన వీక్లీ నివేదికలను క్రమం తప్పకుండా జిల్లా కలెక్టర్లకు సమర్పించాలని సూచించింది. ఈ కమిటీల ఏర్పాటు నుంచి పనుల నాణ్యత, అమలు వరకు మొత్తంగా పర్యవేక్షణ బాధ్యతలను ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకే అప్పగించింది.
Also Read: సినిమా స్టయిల్‌లో ప్రియుడితో కలిసి భర్తను లేపేందుకు స్కెచ్.. కీలక అంశాలు వెలుగులోకి