Telangana Govt: విద్యార్థుల భద్రత, విద్యాసంస్థలను ప్రైవేట్ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడంపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థల ప్రాంగణాల్లో సినిమా ప్రచారాలు, ఇతర వాణిజ్య కార్యకలాపాలపై నిషేధం విధించాలని డిసైడ్ అయ్యింది.
తెలంగాణలో విద్యా సంస్థలు గాడి క్రమంగా తప్పుకున్నాయి. విద్యార్థులకు భవిష్యత్‌కు బాటలు వేయాల్సిన ఆయా సంస్థలు రూటు మార్చాయి. లక్షలు దారపోసి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివిస్తున్నారు. వాటిని విద్యాసంస్థలు ఏమీ పట్టించుకోలేదు. ఒక విధంగా చెప్పాలంటే కొన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు రూటు మార్చాయి. విద్యార్థులను తమ రాజకీయ, కుటుంబ అవసరాల కోసం వినియోగించు కోవడం మొదలైంది. ముఖ్యంగా సినిమా ప్రమోషన్లకు ప్రయార్టీ ఇస్తున్నాయి.
దీనివల్ల తమ సంస్థలు ప్రజల్లో మాంచి క్రెడిట్ వస్తుందని ఆలోచన చేస్తున్నాయి. తొలుత ఒకటి, రెండు సంస్థల్లో మొదలైన ఈ విష సంస్కృతి రానురాను మిగతా విద్యాసంస్థలకు వ్యాపిస్తోంది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఆందోళన మొదలైంది. పరిస్థితి గమనించిన తెలంగాణ ప్రభుత్వం, అలాంటి ప్రమోషన్లపై నిషేధం విధించాలని ఆలోచన చేస్తోంది. అందులోనూ ఫిల్మ్ ప్రమోషన్ల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరుగుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల కొన్ని సార్లు విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు.
ఈ క్రమంలో విద్యా సంస్థల్లో సినిమా, ప్రైవేటు కార్యకలాపాలను ప్రమోషన్లపై నిషేధం విధించాలని ఆలోచన చేస్తోంది. దీన్ని అనుకూలంగా మలచుకున్న కొన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు.. సెలవులు ఇవ్వడం జరుగుతోంది. ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలు తల్లిదండ్రులను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో విద్యా సంస్థలు చట్టపరంగా విద్యాసంస్థల్లో ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఎలాంటివాటికి దూరంగా ఉండాలనే దానిపై సమగ్రంగా అధ్యయనం చేయాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించినట్టు సమాచారం.
ALSO READ: బక్కచిక్కిన తమ్మిడికుంట చెరువుకు పూర్వ వైభవం.. రూ.20 కోట్లతో సుందరీకరణ!
ప్రతిపాదిత చట్రం ప్రకారం.. విద్యా సంస్థలు తమ ప్రాంగణాలను ప్రధానంగా విద్యా, క్రీడా కార్యకలాపాల కోసం ఉపయోగించుకోవచ్చు. విద్యా సంస్థలు తమ క్యాంపస్‌లను వాణిజ్య ప్రచారాలకు వేదికలుగా మారకుండా విద్యాభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి నైపుణ్యాల పెంపునకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. విద్యార్థుల ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ఆవిష్కరణలను ప్రోత్సహం, ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్, గూగుల్ ఫర్ స్టార్టప్స్, ఏఐ ఇన్నోవేషన్ హబ్, తెలంగాణ ఇన్నోవేషన్ స్టార్టప్ ఛాలెంజ్ వంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తోంది. ఇటీవల తెలంగాణ ఉన్నత విద్యామండలి విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతపై చట్టం చేయాలని ముసాయిదా నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేసింది. ఆ నివేదికపై పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.