Telangana Bills: స్వేచ్ఛ బ్యూరో: మత సామరస్యమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. మతపరంగా కించపరిచే వ్యాఖ్యలపై ఇక నుంచి ఉక్కుపాదం చూపాలని భావిస్తున్నది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక బిల్లు తీసుకురావాలని ఆలోచిస్తున్నది. ఇప్పటికే ఈ నిబంధన అమల్లో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం స్టడీ చేసినట్లు తెలిసింది. దీంతో ఆ చట్టాన్ని ఇక్కడ కూడా తీసుకురావాలని ఆలోచిస్తున్నది. ఇటీవల సోషల్ మీడియా వేదికగా మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు పెరిగిపోతున్నాయి. పొలిటికల్ ఫ్లాట్ ఫామ్ లలోనూ కొందరు లీడర్ల ఈ తరహాలోనే కామెంట్లు చేస్తున్నారు. తద్వారా ప్రజల్లోనూ ఇలాంటి కల్చర్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతోనే కర్ణాటక తరహాలోని చట్టం తెలంగాణలోనూ తీసుకురావాలని ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు తెలిసింది. ఈ బడ్జెట్ సెషన్స్ లోనే ఆ బిల్లు పెట్టేలా ప్రభుత్వం తన యాక్షన్ ప్లాన్‌ను స్పీడప్ చేసినట్లు తెలిసింది.
కన్న తల్లిదండ్రులను సరిగ్గా చూడని ప్రభుత్వ ఉద్యోగుల జీతం నుంచి కోత విధించేలా యాక్షన్ ప్లాన్ రెడీ అయింది. గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి రెండు సార్లు హెచ్చరించారు. ఇప్పుడు బిల్లు రూపంలో తీసుకురానున్నారు. ఆ బిల్లును ఈ బడ్జెట్ సెషన్స్ లోనే పెట్టే ఛాన్స్ ఉన్నదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోని పక్షంలో సదరు ప్రభుత్వ ఉద్యోగి జీతంలో 10 శాతం కోత విధిస్తారు. ఈ బిల్లు వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఈ బిల్లు ఒక హెచ్చరిక కానుంది.
Also Read: PM Narendra Modi: త్వరలో తెలంగాణ కు ప్రధాని మోడీ? హైదరాబాద్ లో బహిరంగ సభ కు ప్లాన్!
ఇక చిన్నారులు, యువతపై డిజిటల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిపోతోంది. అశ్లీలత, హింసను ప్రేరేపించే కంటెంట్‌కు చెక్ పెట్టేందుకు డిజిటల్ మీడియా ఏజ్ లిమిట్ బిల్లును ప్రభుత్వం తీసుకురానున్నట్లు తెలిసింది. డిజిటల్ అరాచకాలను కట్టడి చేస్తూ, భావి తరాలను సన్మార్గంలో ఉంచడమే దీని ప్రధాన లక్ష్యం. దేశ వ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అందరి కంటే ముందుగా ఉండాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.
హైదరాబాద్ మహానగర పాలనలో కూడా కీలక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జీహెచ్‌ఎంసీ యాక్ట్‌కు సంబంధించి మరో రెండు సవరణలు ప్రవేశపెట్టనున్నారు. క్యూర్, రేర్, ప్యూర్ అనే విధానాన్ని పొందుపరచనున్నారు. దీంతో నగర పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, పారదర్శక పాలన ఈ కొత్త ఫార్ములాలో అమలు కానున్నదని భావిస్తున్నారు.
డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు వంటి ‘గిగ్ వర్కర్ల’ సంక్షేమం కోసం ప్రత్యేక సవరణలు తీసుకురానున్నారు. వారి పని గంటలు, భద్రత, సామాజిక ప్రయోజనాలపై దృష్టి సారించనున్నారు. ఇందుకోసం కూడా గతంలో ప్రవేశపెట్టిన యాక్ట్‌ను సవరించనున్నారు. ఈ బిల్లులు చట్టరూపం దాల్చితే అటు సామాజికంగా, ఇటు పరిపాలనా పరంగా రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉంది. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు కుటుంబ విలువల సంరక్షణకు ఇవి పెద్ద పీట వేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
Also Read: BRS Party: కాంట్రవర్సీలపై గులాబీ దృష్టి.. అధికార పక్షంకు మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని వ్యూహం?