Telangana:స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల మహోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 16 నుంచి హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ (పెద్ద అంబేద్కర్ విగ్రహం పక్కన) రాష్ట్రస్థాయి చేతివృత్తి కళాకారుల వస్తు ప్రదర్శన అమ్మకాల మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బోనాల పండుగకు అవసరమైన అన్ని రకాల చేతివృత్తుల ఉత్పత్తులు ఒకే వేదికపై ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ మేళాను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఉత్పత్తులను నేరుగా ప్రజలకు విక్రయించే అవకాశం
తెలంగాణ సంప్రదాయ కళలు, గ్రామీణ వృత్తిదారులకు ఈ మేళా గొప్ప వేదికగా నిలుస్తుందని, బోనాలు కేవలం ఆధ్యాత్మిక ఉత్సవమే కాకుండా తెలంగాణ సంస్కృతి, కళలు, చేతివృత్తుల వైభవాన్ని ప్రతిబింబించే మహోత్సవమని అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, విశ్వబ్రాహ్మణ, పద్మశాలి, నేత కళాకారులు, బంగారు పనివారు, రాతి శిల్పులు, బుట్టల తయారీదారులు, తోలు కళాకారులు తదితర సంప్రదాయ కులవృత్తులకు చెందిన కళాకారులు తమ ఉత్పత్తులను నేరుగా ప్రజలకు విక్రయించే అవకాశాన్ని ఈ మేళా కల్పిస్తోందని తెలిపారు. ఆదివారం మీడియా ప్రకటన విడుదల చేశారు.
Also Read: కేసీఆర్‌కు వారం ఇస్తే రాష్ట్రమంతా నీరే.. కేటీఆర్ సంచలనం!
అందుబాటులోకి అనేక వస్తువులు
బోనాల సందర్భంగా అవసరమయ్యే మట్టి బోనం కుండలు, మట్టి దీపాలు, వెదురు బుట్టలు, గంపలు, జల్లెడలు, పిత్తళి ,రాగి చెంబులు, కలశాలు, ఘటాలు, గంటలు, పూజా సామగ్రి, వెదురు అలంకరణ వస్తువులు, పూల దండలు, తోరణాలు, బోనం అలంకరణ వస్త్రాలు, గాజులు, పూసల అలంకరణ సామగ్రి, పోతురాజు ఉపయోగించే కొరడాలు, కాళ్ల గజ్జెలు, డప్పులు, డోలు వంటి సంప్రదాయ వాద్యాలు, చెక్కతో తయారుచేసిన పూజా పీటలు, చిన్న మండపాలు తదితర అనేక వస్తువులు ఈ మేళాలో అందుబాటులో ఉంటాయని మంత్రి వివరించారు.
వారసత్వాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర
బోనాల పండుగతో కుమ్మరి, మేదరి, కంసాలి, వడ్రంగి, డప్పు కళాకారులు, పూల వ్యాపారులు, వస్త్ర కళాకారులు తదితర వేలాది మంది సంప్రదాయ చేతివృత్తిదారులకు ఉపాధి లభిస్తుందని, ఈ మేళా వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడటమే కాకుండా తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.గత ఏడాదితో పోలిస్తే ఈసారి మరింత ఎక్కువ మంది చేతివృత్తి కళాకారులకు అవకాశం కల్పిస్తూ, అధిక సంఖ్యలో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. గతంలో కుమ్మరి, మేదరి, వడ్రంగి, గీత కార్మికులు, పూసల కళాకారులు, కంచరి, నేత తదితర వృత్తులవారు విజయవంతంగా తమ ఉత్పత్తులను విక్రయించారని, ఈసారి ఇంకా ఎక్కువ కులవృత్తులకు ప్రాధాన్యం కల్పిస్తున్నామని చెప్పారు.
జీవనోపాధి బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యత
ప్రజా ప్రభుత్వం చేతివృత్తుల పరిరక్షణకు, సంప్రదాయ కళాకారుల జీవనోపాధి బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, వారి ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడం, ఆదాయాన్ని పెంచడం, యువతను సంప్రదాయ వృత్తుల వైపు ప్రోత్సహించడం ఈ మేళా ప్రధాన లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గ్రామీణాభివృద్ధి శాఖ, సెర్ప్ ఆధ్వర్యంలో వివిధ కులవృత్తుల కళాకారులకు హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో నేరుగా అమ్మకాలు నిర్వహించే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. బోనాల ఉత్సవాల సందర్భంగా నగరానికి వచ్చే లక్షలాది మంది భక్తులు ఈ మేళాను సందర్శించి చేతివృత్తుల ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా కళాకారుల కుటుంబాలకు అండగా నిలవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
Also Read: ‘కూలేశ్వరం’పై కేటీఆర్ కొత్త కథలు.. అద్దంకి దయాకర్ షాకింగ్ కామెంట్స్!
రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున మేళా
మనం కొనుగోలు చేసే ప్రతి చేతి ఉత్పత్తి ఒక కళాకారుడి కుటుంబానికి భరోసా, ఒక సంప్రదాయ వృత్తికి జీవం అని పేర్కొన్న మంత్రి, తెలంగాణ సంస్కృతిని కాపాడుతూ చేతివృత్తులకు కొత్త ఊపునిచ్చే ఈ మేళాను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. బోనాల ఉత్సవాల నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ రాష్ట్రస్థాయి చేతివృత్తుల మేళాను ప్రోత్సహించేందుకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున ఈ మేళాను సందర్శించి సంప్రదాయ చేతివృత్తులను ఆదరించి విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.