Telangana High court CJ : దేశంలోని న్యాయ వ్యవస్థలో హైకోర్టులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల బదిలీలపై సుప్రీం కోర్టు కొలిజియం కీలక సిఫార్సులు చేసింది. ఇందులో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ఆలోక్ అరాధేని బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఆయన ఇక్కడి నుంచి బదిలీ అయిపోయిన తర్వాత ఆ స్థానంలో జస్టిస్ సుజయ్ పాల్ తాతాలిక ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తారు.
ఆలోక్ ఆరాధేతో పాటు ప్రస్తుతం బాంబే హైకోర్టులో సీజేఐ గా పనిచేస్తున్న జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయను దిల్లీ హైకోర్టుకు మార్చాలని సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయించింది. ఈ మేరకు బదిలీల సిఫార్సులపై ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా.. ఈ సిఫార్సులకు కేంద్రం ఆమోదం తెలిపిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు వెళ్లనున్నాయి. ఆమె ఆమోదముద్ర వేశాక.. నియామక ఉత్తర్వులు జారీచేయనున్నారు. ఆ తర్వాతే.. వీరిద్దరు నూతన స్థానాల్లో బాధ్యతులు స్వీకరించనున్నారు.
తెలంగాణ హైకోర్టు ప్రస్తుత సీజేఐ గా విధులు నిర్వహిస్తున్న జస్టిస్ ఆలోక్.. 2023 జులై 19న రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కాగా. 23 వ తేదీ నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు. తెలంగాణ హైకోర్టులో ఆయన గత 18 నెలలుగా సేవలు అందిస్తున్నారు.
సుప్రీం కోర్టు కొలిజీయం సిఫార్సుల్లో పట్నా హైకోర్టు సీజేఐ గా ఉన్న కే. వినోద్ చంద్రన్ ను సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమోట్ చేస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ప్రస్తుత సిఫార్సుల్లో ఆయనకు మాత్రమే.. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా తీసుకోవాలని సూచించింది. కాగా.. వినోద్ చంద్రన్.. 2011 నవంబరు 8న కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు అయ్యారు. అక్కడి నుంచి 2023 మార్చి 29న పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. న్యాయ వ్యవస్థలో సుదీర్ఘ అనుభవం ఉన్న జస్టిస్ వినోద్ చంద్రన్ ను సుప్రీం కోర్టు సేవల్లో వినియోగించుకోవాలని సుప్రీం కోలీజియం నిర్ణయించింది.
న్యాయ వ్యవస్థలో హైకోర్టు న్యాయమూర్తిగా 11 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న జస్టిస్ వినోద్, హైకోర్టు సీజేఐగా ఏడాదికి పైగా అనుభవం ఉంది. ఈ అర్హతల కారణంగానే ఆయనను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి కొలీజియం ఏకగీవ్రంగా సిఫార్సు చేసింది. ఈయన కేరళ హైకోర్టు తరఫున న్యాయమూర్తుల సినియారిటీ జాబితాలో ఉన్న జస్టిస్ వినోద్ చంద్రన్.. సుప్రీం కోర్టులో కేరళ హైకోర్టుకు ప్రాతినిధ్యం లేని విషయాన్ని గుర్తించి ఈయను సిఫార్సు చేస్తున్నట్లు తెలిపింది. కాగా.. ఆల్ ఇండియా హైకోర్టు న్యాయమూర్తుల సీనియారిటీ జాబితాలో 13వ స్థానంలో ఉన్నట్లు వెల్లడించింది.
Also Read : సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జరభద్రం!. ఈ జాగ్రత్తలు పాటించండి.. లేదంటే ఇళ్లు గుల్లే..
తాజా కేటాయింపుతో.. సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెరగనుంది. భారత అత్యున్నత ధర్మాసనంలో మొత్తంగా 34 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా.. 32 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. ఈ తరుణంలో జస్టిస్ వినోద్ చంద్రన్ కేటాయింపుతో న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరుతుందని సుప్రీం కొలీజియం తెలిపింది.