Sankranti Festival : సంక్రాంతి వచ్చిందంటే చాలు హైదరాబాద్ వంటి నగరాల నుంచి పల్లెలకు భారీగా వెళుతుంటారు. చుట్టూ అయిన వాళ్లు, బంధువుల మధ్యలో సరదాగా పండుగను జరుపుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. నెలల ముందు నుంచే టికెట్లు బుక్ చేసుకుని ప్రయాణాలకు సిద్ధమైపోతుంటారు. ఓ రకంగా చెప్పాలంటే.. హైదరాబాద్ వంటి మహా నగరాలు సైతం సంక్రాంతి రోజుల్లో బోసి పోతుంటాయి. ఇక్కల లక్షల మంది సొంతూర్లకు తరలిపోవడంతో.. ఇక్కడి రోడ్లన్ని ఖాళీగా కనిపిస్తుంటాయి. పిల్లలకు సెలవులు కూడా కలిసి వస్తుండడంతో.. హాయిగా ఇంట్లో గడిపేయొచ్చని చూస్తుంటారు. అయితే.. దొంగలకు ఇదే మంచి అదును అంటున్నారు పోలీసులు.
పగలు పూట రెక్కీలు నిర్వహించి, రాత్రిళ్లు చోరీలకు పాల్పడతారని హెచ్చరిస్తున్నారు. అందుకే.. ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు నగర వాసులకు అనేక సూచనలు చేశారు. సంక్రాంతి పండుగ దృష్ట్యా చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని, ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపిన పోలీసులు.. ప్రజలకు సైతం కొన్ని సూచనలు చేశారు.
సంక్రాంతికి ఊరెళ్లే వారికి పోలీసుల సూచనలు..
దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి చిరునామా, ఫోన్ నెంబర్‌ను సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులకు తెలపాలని సూచించారు. దీంతో ఆయా వివరాల ఆధారంగా ఆయా ఇళ్లపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చుట్టు పక్కల వారిని గమనించమని చెప్పాలని, నమ్మకమైన పొరుగు వారికి చెప్పి ఉంచడం మంచిదంటున్నారు. విలువైన వస్తువులను స్కూటర్ డిక్కీల్లో, కారులలో పెట్టవద్దని సూచించారు. ద్విచక్రవాహనాలు, కారులను ఇంట్లోనే పార్క్ చేసుకోవాలని, ఇంటి ముందు పార్క్ చేస్తే.. దొంగలకు పని కల్పించినట్లు అవుతుందని హెచ్చరిస్తున్నారు.
బీరువా తాళాలను ఇంట్లో ఉంచ వద్దని, తమతోపాటే తీసుకెళ్లాలని పోలీసులు సూచించారు. ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్ కర్టెన్ వేయాలి. గ్రామాలకు వెళ్లే వారు ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి. పని మనుషులు ఉంటే రోజూ వాకిలి ఊడ్చమని చెప్పాలి. టైమర్‌తో కూడిన లైట్లను ఇంట్లో అమర్చుకోవడం వల్ల రాత్రి కాగానే.. లైట్లు వెలుగుతాయని సూచిస్తున్నారు.
ఇంట్లో లేనప్పుడు ఇంటి ముందు చెత్త చెదారం, News Papers & పాల ప్యాకెట్లు వంటివి ఉండకుండా జాగ్రత్త పడాలంటున్నారు. ఒకవేళ.. ఎక్కువ రోజులు పాల ప్యాకెట్లు, పేపర్ తీయకుండా ఉంటే.. ఇంట్లో ఎవరూ లేరని దొంగలు అనుమానం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదని, ఆరుబయట వాహనాలకు హాండిల్ లాక్‌తో పాటు వీల్ లాక్ వేయాలని, ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమమని పోలీసుల సూచన. బ్యాగుల్లో బంగారు నగలు డబ్బు పెట్టుకొని ప్రయాణం చేస్తున్నప్పుడు బ్యాగులు దగ్గరలో పెట్టుకోవాలని చెబుతున్నారు. బ్యాగు బస్సులో పెట్టి కిందికి దిగితే దొంగలు అపహరిస్తారని చెబుతున్నారు. ఇంటి డోర్‌కు సెంట్రల్ లాకింగ్ సిస్టంను ఏర్పాటు చేసుకోవడం సురక్షితమని సలహా ఇస్తున్నారు.
ఇంట్లో, ఇంటి బయట మోషన్ సెన్సర్ లను ఉపయోగించాలని చెబుతున్నారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించని ఇళ్లు, చీకటి ప్రదేశం, పాత గ్రిల్స్, బలహీనమైన తాళాలు ఉన్న ఇళ్లల్లో దొంగలు పడే అవకశాలు ఎక్కువగా ఉంటాయని.. అందుకే అలాంటి ప్రాంతాలకు కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని చెబుతున్నారు. సైబరాబాద్ కమీషనరేట్లో పోలీసులు సీఎస్ఆర్ సహకారంతో ఇప్పటికే సీసీటీవీ లను ఇన్ స్టాల్ చేశారు. తద్వారా ఎన్నో సంచలనాత్మక నేరాలను ఛేదించారు. ప్రజలు తమ కాలనీలు, ఇళ్లు, పరిసరాలు, షాపింగ్ మాళ్లలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూచిస్తున్నారు.
ప్రజలు తమ ప్రాంతంలో గస్తీ ఏర్పాటుకు సహకరించాలని, పోలీసు స్టేషన్ నెంబర్, వీధుల్లో వచ్చే బీట్ కానిస్టేబుల్ నెంబర్ దగ్గర పెట్టుకోవాలని సైబరాబాద్ కమిషన కమిషనరేట్ పోలీసులు తెలిపారు. ప్రజలు నిరంతరం పోలీసులతో సమన్వయంగా సహకరిస్తే చోరీలను నియంత్రించడం చాలా సులభమంటున్నారు. అనుమానిత వ్యక్తుల కదలికలను గమనించి, పోలీసులకు సమాచారం ఇవ్వాలని,
కాలనీ వాళ్లు కమిటీలు వేసుకొని వాచ్‌మెన్లను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి చెబుతున్నారు.
Also Read :
మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో బయటికి వెళ్ళే విషయాన్ని ఇతరులకు షేర్ చేయవద్దని సూచిస్తున్నారు. కాలనీల్లో దొంగతనాల నివారణకు స్వచ్ఛందంగా కమిటీలను నిర్వహించుకోవాలని, ఈ కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పోలీసులకు అందుబాటులో ఉంటూ అనుమానాస్పద, కొత్త వ్యక్తుల కదలికలపై 100 డయల్ లేదా సైబరాబాద్ పోలీసు వాట్సాప్ నెంబర్ 9490617444 కు సమాచారం ఇవ్వాలని కోరారు.