High Court: స్వేచ్ఛ బ్యూరో: అక్రమ అండాల సేకరణ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు సీరియస్ అయ్యింది. ఇది ఐవీఎఫ్ కేంద్రాల వైద్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎక్కువ అండాలను సేకరించేందుకు మహిళలకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వడాన్ని దోపిడీగా అభివర్ణించింది. డబ్బు ఆశ చూపించి వేర్వేరు రాష్ట్రాలకు చెందిన యువతులు, మహిళలను హైదరాబాద్ కు రప్పించిన నెట్ వర్క్ గుట్టును ఇటీవల మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు రట్టు చేసిన విషయం తెలిసిందే.
హైకోర్టు సీరియస్..
ఈ క్రమంలో పదిమందికి పైగా నిందితులను అరెస్ట్ చేసి నలభైమందికి పైగా యువతులు, మహిళలను రక్షించారు. ఇరవైకి పైగా ఐవీఎఫ్ కేంద్రాలకు నోటీసులు కూడా జారీ చేశారు. దాంతో కొన్ని ఐవీఎఫ్ కేంద్రాలకు చెందిన కొందరు డాక్టర్లు హైకోర్టును ఆశ్రయించాయి. వారి తరపున న్యాయవాది శుక్రవారం వాదనలు వినిపిస్తూ మహిళల్లో సహజంగా ఒక అండం మాత్రమే విడుదలవుతుందని చెప్పారు. హార్మోన్ ఇంజెక్షన్ల ద్వారా ఏడు అండాల వరకు సేకరించే వీలుంటుందన్నారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘ఎక్కువ అండాల సేకరణ కోసం మహిళలకు హార్మోన్ల ఇంజెక్షన్లు ఇవ్వడం దోపిడీ కిందకు రాదా? ఎక్కువ పాలు పొందేందుకు బర్రెకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తే దాని ఆరోగ్యం దెబ్బతినదా?’ అని సూటిగా ప్రశ్నించింది. కేసులో నిందితులుగా ఉన్న వైద్యులు పోలీస్ విచారణకు పూర్తిగా సహకరించాలని పేర్కొంది.
షోకాజ్ నోటీసులకు సమాధానం ఇవ్వాలి..
దాంతోపాటు వైద్యాధికారులు జారీ చేసిన షోకాజ్ నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఇంతకుముందు జరిగిన విచారణలో జస్టిస్ శ్రావణ్ కుమార్ ధర్మాసనం ముఖ్యమైన సూచనలు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆయా సంతాన సాఫల్య కేంద్రాల్లో నిల్వ ఉన్న 17,156 అండాలను సురక్షితంగా భద్రపరిచేందుకు, పర్యవేక్షించేందుకు నిపుణులతో కూడిన ప్రత్యేక వైద్య కమిటీని ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించింది. సదరు ఫర్టిలిటీ కేంద్రాల్లో ఇప్పటికే చికిత్స పొందుతున్న 51 మంది రోగులకు ఇబ్బంది కలగకుండా, వారిని సమీపంలోని ప్రభుత్వ ఐవీఎఫ్ కేంద్రాలకు తరలించి చికిత్స కొనసాగించాలని స్పష్టం చేసింది. పిటిషనర్ల ఆరోపణలపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
Also Read: దమ్ముంటే హైదరాబాద్‌లో ఓవైసీపై పోటీ చేయి.. అమిత్ షాకు రేవంత్ సవాల్