High Court Stays Amit Shah Doctored Video Case: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎడిటెడ్ వీడియో కేసుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో ఎలాంటి ముందస్తు విచారణ చేపట్టవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురిని అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో మన్నె సతీష్, పెట్టం నవీన్, తస్లీమ్, గీత, పెండ్యాల వంశీకృష్ణ ఉన్నారు. అయితే వారిని కోర్టులో ప్రవేశ పెట్టిన తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 10 వేలు, ఇద్దరి పూచీకత్తుపై నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతే కాదు ఇవాళ ఈ కేసుకు సంబంధించి ఢిల్లీలో అరెస్టు కూడా జరిగింది. స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ అనే వెబ్ పేజీ నిర్వహిస్తున్న అరుణ్ రెడ్డి అనే వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రస్తుతం ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇదే క్రమంలో రిజర్వేషన్లకు సంబంధించి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన అమిత్ షా ఎడిటెడ్ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తింది. దీంతో ఈ కేసులో ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. ఢిల్లీ పోలీసులు హైదరాబాద్‌లోనే మకాం వేశారు. గురువారం నుంచి హైదరాబాద్‌లోనే ఉన్నారు. హైదరాబాద్ పోలీసుల అదుపులో ఉన్న ఐదుగురిని అరెస్ట్ చేయాలని ఢిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
ఎన్నికల వేళ మరింత హీట్ పుట్టిస్తున్న ఈ కేసులో ముందస్తు విచారణ చేపట్టవద్దంటూ హైకోర్టు బ్రేక్ వేయడం చర్చనీయాంశమైంది.
Also Read: అమిత్ షా ఫేక్ వీడియో కేసులో న్యూట్విస్ట్.. ముగ్గురు అరెస్ట్!
కాగా గత నెల 23వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో అమిత్ షా రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేసినట్లు ఎడిటడ్ వీడియో.. ప్రధాన నిందితుడు వంశీ వాట్సాప్‌కు వచ్చింది. దీంతో వంశీ వివిధ గ్రూప్లల్లో షేర్ చెయ్యడమే కాకుండా కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. దీంతో మిగిలిన వారు కూడా తమ ట్విట్టర్ అకౌంట్లల్లో పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన వీడియోలో ఎలాంటి వాస్తవం లేకపోవడంతో ట్విట్టర్ ఆ వీడియోని తొలగించింది. కేంద్ర హోం శాఖ ఫిర్యాదు చేయడంతో తెలంగాణ సీఎంతో పాటు టీపీసీసీ సోషల్ మీడియా టీమ్‌కి నోటీసులు అందజేశారు ఢిల్లీ పోలీసులు.