Telangana: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విభజన చట్టంపై బీజేపీ పార్లమెంట్ సభ్యులు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించాల్సినవని దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ అన్నారు. మిరుదొడ్డి మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడిన ఆయన పార్లమెంటులో తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని విమర్శించారు. తెలంగాణ విభజనను పాకిస్తాన్‌తో పోల్చడం దురదృష్టకరమని ఇటువంటి వ్యాఖ్యలు తెలంగాణ సమాజాన్ని అవమానించడమేనని ఆయన పేర్కొన్నారు. ఇదే క్రమంలో మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు కూడా 2014లో ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తీవ్ర ఆక్షేపణీయమని అన్నారు.
తెలంగాణపై బీజేపీ ద్వంద్వ వైఖరి..
అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి, విస్తృత చర్చల అనంతరం రూపొందించిన చట్టాన్ని తప్పుగా చిత్రీకరించడం వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని ప్రజలు గమనిస్తున్నారని వెంకటస్వామి గౌడ్ తెలిపారు. బీజేపీ పార్టీకి మొదటి నుంచే తెలంగాణపై ద్వంద్వ వైఖరి ఉందని 1999లో కాకినాడ సభలో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని ప్రకటించి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీని విస్మరించిన విషయాన్ని గుర్తు చేశారు. అదే విధంగా పార్లమెంట్‌లో ప్రధానమంత్రి చేసిన తల్లిని చంపి, బిడ్డను బతికించారు అనే వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బీజేపీ నిజమైన వైఖరి తెలంగాణపై ఎప్పుడూ స్పష్టంగా లేదని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీసుకున్న నిర్ణయంతోనే రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు.
వెంకటస్వామి గౌడ్ సవాల్..
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అప్పట్లో పార్టీకి రాజకీయ నష్టం జరిగినా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని రాష్ట్రాన్ని సాధించిందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం,ప్రణబ్ ముఖర్జీ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ సూచనల ఆధారంగా యూపీఏ ప్రభుత్వం తెలంగాణను ఏర్పాటు చేసిందని వివరించారు. కేంద్రంలో 12 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏమి చేసిందో చెప్పాలని సవాల్ విసిరిన వెంకటస్వామి గౌడ్ రాష్ట్రంపై విషం చిమ్మే ప్రయత్నాలు కొనసాగితే ప్రజలు తగిన సమాధానం ఇస్తారని హెచ్చరించారు.
తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి..
తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు రాష్ట్ర గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తేజస్వి సూర్య , రఘునందన్ రావు వెంటనే తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మిరుదొడ్డి ఏఎంసీ వైస్ చైర్మన్ చెన్నై భూపాల్ గౌడ్, లక్ష్మీనగర్ సర్పంచ్ వజ్జాపల్లి రాజు,నేరెళ్ల కిష్టగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: శ్రీ ఇందు కాలేజీలో విషాదం.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య