Urban Development: నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ , టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, భవిష్యత్తు ప్రణాళికలు మరియు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
తెలంగాణలో ప్రస్తుతం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పాలన సాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ముఖ్యంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొని.. జైలుకు వెళ్లిన ఉద్యమకారులను ఆదుకుంటామని ప్రకటించారు. వీరి కోసం త్వరలోనే ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేస్తామని.. అర్హులైన ఉద్యమకారులకు 250 గజాల నివాస స్థలాన్ని కేటాయిస్తామని వెల్లడించారు.
మున్సిపాలిటీల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పన , అభివృద్ధి పనుల కోసం 40 రోజుల ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు చెప్పారు. అభివృద్ధి విషయంలో రాజకీయం ఉండకూడదని.. పట్టణాల ప్రగతికి అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు ఉండాలని.. అభివృద్ధి విషయంలో అందరూ ఏకం కావాలని ఆయన సూచించారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో ఇక్కడి ఎంపీలు, కేంద్ర మంత్రులు చొరవ చూపి.. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. పట్టణాల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని నేతలు పేర్కొన్నారు.
Also Read: రాష్ట్రంలో ‘తెలంగాణ జాగృతి’యే అసలైన ప్రతిపక్షం.. కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు