Property Tax: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ లోని ప్రజలకు పౌర, అత్యవసర సేవలందించే ట్రై మున్సిపల్ కార్పొరేషన్ల ముఖ్యమైన ఆర్థిక వనరుల్లో ప్రధానమైన ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపునకు మంగళవారం చివరి రోజు కానుంది. వర్తమాన ఆర్థిక సంవత్సరం (2025-26) నేటితో ముగియనుండటం, చెల్లింపులకు మంగళవారం చివరి రోజు కావటంతో ఈ ఒక్క రోజు రాత్రి పన్నెండు గంటల వరకు చెల్లింపులకు అవకాశముండటంతో ఈ ఒక్క రోజే రూ. వంద కోట్ల వరకు వసూలవుతుందని కార్పొరేషన్ల అధికారులు అంఛనాలేస్తున్నారు. ఇప్పటి వరకు మూడు కార్పొరేషన్లలో సుమారు రూ. 2350 కోట్ల వరకు ఆస్తి పన్ను కలెక్షన్ అయినట్లు సమాచారం.
వీటిలో అత్యధికంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( సీఎంసీ)లో రూ. 940 కోట్లు, రెండో స్థానంలో ఉన్న జీహెచ్ఎంసీ పరిధిలో రూ.889.50 కోట్లు, మాల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ లో రూ.518 కోట్లు వసూలైనట్లు అధికారులు వెల్లడించారు. తొలుత మూడు కార్పొరేషన్లలో సుమారు రూ. 3 వేల కోట్ల వరకు ట్యాక్స్ కలెక్షన్ చేయాలని అధికారులు టార్గెట్ పెట్టుకోగా, గత ఫిబ్రవరి 10వ తేదీన జీహెచ్ఎంసీ పరిధి మూడు కార్పొరేషన్లుగా పునర్విభజించిన తర్వాత ఈ టార్గెట్ ను రూ. 2500 కోట్లకు కుదించుకున్నట్లు సమాచారం. గత సంవత్సరం నవంబర్ 25వ తేదీ తర్వాత జీహెచ్ఎంసీలో విలీనమైన 27 పట్టణ స్థానిక సంస్థల్లోని ప్రాపర్టీ ట్యాక్స్ సమాచారం.
మొత్తం జీహెచ్ఎంసీ తరహాలో పూర్తిగా ఆన్ లైన్ కాకపోవటంతో, ఈ సారి జీహెచ్ఎంసీ పరిధి పెరిగి, మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటైనందున గత ఆర్థిక సంవత్సరం (2024-25) లో వసూలైన ట్యాక్స్ రూ. 2038 కోట్లు ఉండగా, అదనంగా మరో రూ. 400 కోట్ల పై చిలుకు వసూలు చేయాలని నిర్ణయించి, రూ. 2500 కోట్ల టార్గెట్ ను ఫిక్స్ చేసినట్లు తెలిసింది. ట్యాక్స్ కలెక్షన్ పెంచుకునేందుకు ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కాగరం పేరుతో ట్యాక్స్ సంబంధిత వివాదాలను పరిష్కరించుకోవటంతో పాటు రకరకాలుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో ట్యాక్స్ కలెక్షన్ ను డైలీ కమిషనర్లు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మంగళవారం రాత్రి పన్నెండు గంటల వరకు జరగనున్న కలెక్షన్ తో దాదాపు టార్గెట్ కు తగిన విధంగా రూ. 2500 కోట్ల వరకు ట్యాక్స్ వసూలయ్యే అవకాశమున్నట్లు తెలిసింది.
Also Read: ఇలా చేస్తే.. తక్కువ బడ్జెట్‌లో.. సింపుల్‌గా సింగపూర్ చుట్టేయొచ్చు!
ఏళ్లుగా పేరుకుపోయిన ప్రాపర్టీ ట్యాక్స్ మొండి బకాయిలను వసూలు చేసుకునేందుకు సర్కారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి డిసెంబర్ మాసం నుంచే మొండి బకాయిలు చెల్లించే వారికి పన్నుపై విధించిన వడ్డీల్లో 90 శాతం రాయితీనిస్తూ వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్) స్కీమ్ ను అమలు చేస్తున్నారు. ఈ స్కీమ్ కు కూడా నేటితో గడువు ముగియనుంది. ఇప్పటికే రూ. వేల కోట్లలో పేరుకుపోయిన ఈ మొండి బకాయిల్లో మార్చి నెలాఖరు కల్లా కనీసం రూ. వెయ్యి కోట్ల వసూలు చేసుకోవాలని అధికారులు మూడు కార్పొరేషన్లలో మొండి బకాయిదారులకు నోటీసులు జారీ చేసి, ప్రస్తుతం పన్న చెల్లించని ఆస్తులను సీజింగ్ కూడా చేస్తున్నారు.
సోమాజీగూడలోని కత్రియా హోటల్ వంటి బడా వ్యాపార సంస్థలను కూడా అధికారులు సీజ్ చేశారు. ఇప్పటి వరకు మూడు కార్పొరేషన్లలో కలిసి దాదాపు 80 ప్రాపర్టీలను సీజ్ చేసినట్లు, వారు పన్ను చెల్లించే వరకు ఆ ప్రాపర్టీలను అన్ సీజ్ చేసే ప్రసక్తేలేదని అధికారులు తేల్చి చెబుతున్నారు. మొత్తం మూడు కార్పొరేషన్ల పరిధిలో మొత్తం సుమారు 28.80 లక్షల ఆస్తులు ఉన్నాయి. జీహెచ్ఎంసీలో 11.45 లక్షల ఆస్తులు ఉండగా, వాటిలో ఎక్కువ భాగం నివాస గృహాలే. సైబరాబాద్ లో 9.43 లక్షల ఆస్తులు ఉండగా, మల్కాజ్ గిరిలో 7.91 లక్షల ఆస్తులు ఉన్నాయి. వసూళ్ల పరంగా సైబరాబాద్ ముందంజలో ఉంది. ఈ సారి వసూళ్లు 5 నుంచి 10 శాతం వరకు పెరిగి, ఇప్పటి వరకు ఓటీఎస్ ద్వారా రూ. 348 కోట్లు వసూలైనట్లు అధికారులు తెలిపారు. మోడు కార్పొరేషన్లలో జరిగిన ఈ చెల్లింపులతో దాదాపు రూ. 40 కోట్ల వడ్డీ రాయితీ ఇచ్చినట్లు సమాచారం.
Also Read: ప్రభుత్వం పై ఆశావర్కర్లు ఫైర్.. కాంగ్రెస్ ఏడో హమీ అట్టర్ ఫ్లాప్ అంటూ..?