
TS Secretariat: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం ఈనెల 30న ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. ఆరోజు నుంచే అధికారికంగా విధులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అన్ని శాఖల కార్యాలయాల తరలింపు ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ 29లోపు షిఫ్టింగ్ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
కొత్త సచివాలయంలో విధుల నిర్వహణ, దస్త్రాల తరలింపుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని శాఖల కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈనెల 30 నుంచి తమ విధులను కొత్త సచివాలయంలోనే నిర్వహించాలని ఆదేశించారు. ఈనెల 26 నుంచి 29 లోగా అన్ని శాఖలు తమకు సంబంధించిన కంప్యూటర్లు, దస్త్రాలను కొత్త సచివాలయంలోకి చేరవేసుకోవాలని, బీఆర్‌కే భవన్‌లో విధుల నిర్వహణకు శనివారమే ఆఖరి రోజని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
అన్ని శాఖల అధికారుల కార్యాలయాలు, అడిషనల్, జాయింట్ సెక్రెటరీలు, సెక్షన్ ఆఫీసర్లకి సంబంధించిన కార్యాలయాల షిఫ్టింగ్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. కేవలం ఫైల్స్, కంప్యూటర్లను మాత్రమే కొత్త సచివాలయానికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అక్కడ అత్యాధునిక సాంకేతికతో సెక్షన్ ఆఫీసర్ల ఛాంబర్లు సిద్ధమయ్యాయి. పాత సచివాలయం నుండి ఫర్నీచర్ గానీ.. ఏ ఇతర పరికరాలు గానీ తీసుకెళ్లొద్దని.. కొత్త సచివాలయంలో నూతన ఫర్నీచర్‌తో అన్ని సదుపాయాలూ సిద్ధంగా ఉన్నాయని అధికారులకు సీఎం తెలియజేశారు.
సచివాలయం భద్రత ఇకనుంచి తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ చూడనుంది. ఎంత త్వరగా అయితే అంత త్వరగా నూతన సచివాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 600 మంది పోలీసులు, 300సీసీ కెమెరాలతో పాటు సెపరేట్ కమాండ్ కంట్రోల్‌ను ఏర్పాటు చేయనున్నారు. సచివాలయంలోకి వెళ్లేందుకు అధికారులకు ప్రత్యేక బార్ కోడ్‌లు తయారు చేస్తున్నారు. ఫ్లోర్ల వారీగా బార్‌కోడ్‌లు కేటాయించనున్నారు. ఒక ఫ్లోర్‌కు సంబంధించిన బార్ కోడ్లు ఆ ఫ్లోర్ వరకే పని చేసేలా రూపొందిస్తున్నారు.
ఈనెల 30న వేకువజామున 5 గంటల నుంచే సచివాలయ ప్రారంభోత్సవ పూజలు, హోమాలు ప్రారంభమవుతాయి. ఉదయం 9 నుంచి 10 గంటల్లోగా పూజా కార్యక్రమాలు పూర్తవుతాయి. మధ్యాహ్నం 1.10 నుంచి 1.20 మధ్యలో సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. అనంతరం సీఎం తన ఆఫీసులో కొలువుదీరుతారు. అదే సమయంలో సీఎంవో కార్యదర్శులు సహా మంత్రులు, ఇతర కార్యదర్శులు తమ తమ కార్యాలయాల్లో ఆసీనులవుతారని తెలుస్తోంది.