
Teachers: స్పౌజ్ బదిలీల కోసం ఎన్నో నెలలుగా ఎదురుచూస్తూ ఉపాధ్యాయులు తెలంగాణ వ్యాప్తంగా నిరసన తెలుపుతూ రోడ్డెక్కారు. కుటుంబ సభ్యులతో శాంతియుత ర్యాలీలు నిర్వహించి పలు జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. 317 జీవో అమలులో భాగంగా ఉపాధ్యాయ దంపతులను ఒకే జిల్లాకు కేటాయించాల్సి ఉండగా సాంకేతిక లోపాలతో బదిలీలు నిలిచిపోయాయి. గత 16 నెలల క్రితం నిలిచిపోయిన బదిలీలు నేటికి పూర్తికాకపోవడంతో వందలాదిమంది ఉపాధ్యాయ దంపతులు వేర్వేరు చోట్ల విధులు నిర్వహిస్తున్నారు.
2021 డిసెంబర్‌లో ఉపాధ్యాయుల జిల్లా కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యింది. అందులోనే భాగమైన ఉపాధ్యాయ దంపతులను ఒకే జిల్లాకు చేర్చాల్సిన అంశం నేటికీ అపరిష్కృతం గానే ఉంది. దీంతో గత 16 నెలలుగా వారి సమస్యలు ప్రభుత్వానికి, అధికారులకు విన్నవించుకుంటూనే ఉన్నారు. జనవరిలో స్కూల్ అసిస్టెంట్ విభాగంలోని 615 మందికి రీ అలెకేషన్ ఆర్డర్లు ఇచ్చిన ప్రభుత్వం, మరో 1600 మందికి స్పౌజ్ కోటాలో ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది.
స్పౌజ్ బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. భర్త ఒక జిల్లాలో, భార్య మరొక జిల్లాలో విధుల్లో నిర్వర్తించాల్సి ఉండటంతో దంపతులు విడివిడిగా జీవనం కొనసాగించాల్సి వస్తోంది. ఇక వారి పిల్లలు తల్లిదండ్రులకు దూరమై హాస్టళ్లలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వయోవృద్ధులైన తల్లిదండ్రులను దగ్గరుండి చూసుకోలేకపోవడంతో తీవ్ర మానసిక ఆందోళనకు లోనవుతున్నారు.
ఉద్యోగాలు చేస్తున్న దంపతులు ఒకే చోట పనిచేస్తే ఉత్పాదక పెరుగుతందని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రస్తావించిన ఆచరణ మాత్రం సాధ్యంకావడంలేదు. గత 16 నెలలుగా ఉపాధ్యాయ దంపతులు.. అధికార పార్టీ పెద్దలు, మంత్రులు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోవడంలేదు.
ఈ విద్యా సంవత్సరం కూడా పూర్తవడంతో తమ భవిష్యత్తు ఏంటి అనే ఆందోళనలో ఉపాధ్యాయ దంపతుల్లో నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయ దంపతులు కంటతడితో విజ్ఞప్తి చేస్తున్నారు.