మాజీ మంత్రి హరీష్ రావు గజినీ అయిపోయారా, గతం మరచిపోయారా..? ఆయన మాటలు వింటే అదే నిజమనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు తాము చేసిన పనులన్నిటినీ ఆయన మరచిపోయి, ఇప్పుడు కొత్తగా అవే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని అనుకుంటున్నారు హరీష్ రావు. ప్రజలిచ్చిన తీర్పుని కూడా ఆయన అప్పుడే మరచిపోయారనిపిస్తోంది. హరీష్ మరచిపోయినా, ప్రజలు అన్నీ గుర్తించుకుంటారు కదా. అందుకే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఘోర పరాజయం మిగిల్చారు కదా..? అని కౌంటర్లిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
హరీష్ ఏమన్నారంటే..?
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని బీఆర్ఎస్ నేతలు అస్సలు ఊహించినట్టులేరు. కాంగ్రెస్ విజయాన్ని, బీఆర్ఎస్ పరాజయాన్ని కూడా వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు మిగిల్చిన పరాభవం కంటే, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన సున్నా స్కోరు వారిని మరింత కలవరపెడుతోంది. అయినా సరే తిమ్మిని బమ్మిని చేసేందుకు కేసీఆర్ అండ్ టీమ్ ఎప్పుడూ రెడీగానే ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో బీఆర్ఎస్ టీమ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. కాంగ్రెస్ నేతలు కొందరు తమతో టచ్ లో ఉన్నారని, తాను సై అంటే ప్రభుత్వం పడిపోతుందని కూడా చెప్పేవారు కేసీఆర్. ఆయనకు హరీష్ కూడా వంతపాడారు. తీరా ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ బాట పడుతుండే సరికి తమ ఎత్తుగడ ఫలించలేదని వారికి అర్థమైంది. అందుకే ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు. ప్రజలకి జ్ఞానోదయం అయిందని.. వారు ఇప్పుడు కేసీఆర్ గురించి ఆలోచిస్తున్నారని అంటున్నారు హరీష్ రావు.
ప్రజలు అర్థం చేసుకున్నారు.. అందుకే..!
పాలకుల్ని అర్థం చేసుకోవడంలో ప్రజల మేధస్సుని ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేం. అర్థం చేసుకున్నారు కాబట్టే.. కేసీఆర్ ని ఇంటికి సాగనంపారు. తెలంగాణ జాతిపిత అని తమకు తాము సెల్ఫ్ ఎలివేషన్లు ఇచ్చుకున్నవారిని కూడా నిర్దాక్షిణ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారు. ఇంకా ప్రజలు కొత్తగా బీఆర్ఎస్ ని అర్థం చేసుకోడానికి ఏముంది. అయితే ఆ విషయం అర్థం కాక ఇంకా ఆ పార్టీ నేతలు ప్రజలు తప్పు చేశారని అనుకుంటున్నారు. హరీష్ రావు అనుకుంటున్నట్టు ప్రజలేం అమాయకులు కాదని, అందుకే కేసీఆర్ కి విశ్రాంతినిచ్చారని కౌంటర్లిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
బాబ్బాబు సభకు రండి..
బీఆర్ఎస్ రజతోత్సవ సభని సక్సెస్ చేయడానికి ఆపార్టీ నేతలు తెగ కష్టపడుతున్నారు. జనసమీకరణకోసం పాట్లు పడుతున్నారు. ఈ క్రమంలోనే పటాన్ చెరు సభలో పాల్గొన్న హరీష్ రావు.. ప్రజలంతా కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారని స్టేట్ మెంట్ ఇచ్చారు. నిజంగానే ప్రజుల కేసీఆర్ ని కోరుకుంటుంటే.. ఆయన ప్రజల కోసం కనీసం అసెంబ్లీకయినా రావొచ్చు కదా అని కాంగ్రెస్ నేతలు సెటైర్లు పేలుస్తున్నారు. అధికారం దూరమై బీఆర్ఎస్ నేతలు ఇబ్బంది పడుతున్నారని, అందుకే ప్రజలు ఏదో కోరుకుంటున్నట్టుగా హరీష్ రావు ఊహించుకుంటున్నారని విమర్శించారు. వాస్తవానికి ప్రజలు కాంగ్రెస్ పాలననే కోరుకుంటున్నారని, ఇందిరమ్మ రాజ్యంలో వారు ప్రశాంతంగా ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన దోపిడీ, అవినీతికి నేడు ఫుల్ స్టాప్ పడిందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు.