Telangana RTC: ఈ నెల 7 నుంచి తెలంగాణ వ్యాప్తంగా సమ్మెకు దిగాలని భావించాయి ఆర్టీసీ సంఘాలు. సమ్మె నోటీసు ఇచ్చి మూడు నెలలు అవుతున్నా ఆర్టీసీ యాజమాన్యం చర్చలకు పిలవలేదు. చివరి ప్రయత్నంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు సమావేశమయ్యారు. సమ్మెకు వెళ్లవద్దని సంఘాల నేతలకు మంత్రి సూచన చేశారు. దీంతో కార్మికులు కాస్త వెనుకడుగు వేసినట్టు సమాచారం.
సోమవారం మినిస్టర్ క్వార్టర్స్‌లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆర్టీసీ సంఘాల నేతలు కలిశారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను సంఘాల నేతలు మంత్రి దృష్టికి తీసుకొచ్చాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు 21 ప్రధాన సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు.
మంత్రితో ఆర్టీసీ సంఘాల నేతల భేటీ
ఆర్టీసీ సమస్యలపై వారి సంక్షేమం కోరేవాళ్లు ఎవరైనా, ఎప్పుడైనా కలిసి సమస్యలు చెప్పుకోవచ్చన్నారు. తాము నిత్యం అందుబాటులోనే ఉంటామన్నారు మంత్రి పొన్నం. ఆర్టీసీ కార్మికుల సమస్యలు వినడానికి తాను, ముఖ్యమంత్రి ఆఫీసు తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయన్నారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం.. ఈ మూడింటికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, సమస్యలు మెల్లగా తొలగుతున్నట్లు చెప్పారు మంత్రి. ఇలాంటి సమయంలో సమ్మె చేయడం కరెక్టు కాదని ఆర్టీసీ సంఘాల నేతలకు విజ్ఞప్తి చేశారు. మీ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటామన్నారు. 16 నెలలుగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశామని, ఒక్కటైన ఇబ్బంది పెట్టమా అని అన్నారు.
ALSO READ: హైదరాబాద్ మెట్రో డీపీఆర్ రెడీ.. వచ్చే వారం ఆమోదం
ఇప్పుడు ఆర్టీసీ సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు పొన్నం. 1500 మంది కారుణ్య నియామకాలు చేపట్టామని, ఆర్టీసీలో 3038 మంది ఉద్యోగులను రిక్రూట్‌మెంట్ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. కొత్త బస్సులు కొనుగోలు చేశామని, తార్నాక ఆసుపత్రిను సూపర్ స్పెషాలిటీ గా మార్చామన్నారు.
ఎప్పుడైనా సమస్యలు చెప్పొచ్చు
దశాబ్దంపాటు ఆర్టీసీని నిర్వీర్యం చేశారని, ఒక్క బస్సు కొనుగోలు చేయలేదన్నారు. ఒక్క ఉద్యోగం కూడా నియామకం జరగలేదన్నారు. సీసీఎస్, పీఎఫ్ పైసలు వాడుకున్నారని గుర్తు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు 2013 నుండి చెల్లించాల్సిన బాండ్ మొత్తం రూ.400 కోట్లు చెల్లించిందన్నారు. 2017 పే స్కేల్ 21 శాతం ఇచ్చిందని, దీనివల్ల ఏడాదికి రూ. 412 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందన్నారు.
పిఎఫ్ ఆర్గనైజేషన్‌కు సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న రూ. 1039 కోట్లు చెల్లించామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పీఎఫ్ కంట్రిబ్యూషన్ జనవరి-2024 నుండి క్రమం తప్పకుండా చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సీసీఎస్ బకాయిలు ఉద్యోగులకు రూ. 345 కోట్లు చెల్లించామని వివరించారు.
మంత్రి నుంచి సానుకూల స్పందన రావడంతో కార్మికులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అంటున్నారు సంఘాల నేతలు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన వారిలో ఆర్టీసీ జేఏసి చైర్మన్ టీఎంయూ జనరల్ సెక్రటరీ అశ్వద్ధామ రెడ్డి, ఎన్ఎంయూ జనరల్ సెక్రటరీ నరేందర్, కార్మిక సంఘ్ జనరల్ సెక్రెటరీ ఎర్ర స్వామికుమార్, ఎస్టీఎంయూ జనరల్ సెక్రెటరీ హరికృష్ణ పలువురు ఆర్టీసీ సంఘాల నేతలు ఉన్నారు.