Telangana Panchayati Elections : తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తూ.. పోలింగ్ నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుండగా, ఓటింగ్ పూర్తయిన వెంటనే కౌంటింగ్ నిర్వహించి విజేతలను ప్రకటించనున్నారు.
ఈ రెండో విడత ఎన్నికల్లో మొత్తం 3,911 సర్పంచ్ పదవులకు గాను 12,782 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అదే విధంగా 29,917 వార్డు స్థానాలకు గాను 71,071 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8,307 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం గమనార్హం.
ఇదిలా ఉండగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో.. రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 564 సర్పంచ్ స్థానాల్లో 57 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 506 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ స్థానాలకు గాను 1,660 మంది అభ్యర్థులు బరిలో నిలవడం పోటీ తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది.
వరంగల్ జిల్లాలోని వంజరపల్లి పంచాయతీలో రిజర్వేషన్ కారణంగా.. నామినేషన్లు దాఖలు కాలేదు. ఇదే సమయంలో రెండో విడతలో భాగంగా ఉన్న 4,928 వార్డు స్థానాల్లో 917 స్థానాలు ఏకగ్రీవంగా ముగిశాయి. మరోవైపు 8 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో అక్కడ కూడా ఎన్నికలు జరగలేదు. మిగిలిన 4,003 వార్డు స్థానాలకు గాను 9,632 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
ఎన్నికల నిర్వహణలో శాంతిభద్రతలు అత్యంత కీలకమైన అంశంగా ఉండటంతో, 84 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటూ, పోలింగ్ సజావుగా సాగేలా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
జిల్లాల వారీగా చూస్తే, వరంగల్ జిల్లాలో 111 సర్పంచ్ స్థానాలకు 349 మంది అభ్యర్థులు, హన్మకొండ జిల్లాలో 67 సర్పంచ్ స్థానాలకు 248 మంది, ములుగు జిల్లాలో 37 సర్పంచ్ స్థానాలకు 114 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే భూపాలపల్లి జిల్లాలో 75 సర్పంచ్ స్థానాలకు 244 మంది, జనగామ జిల్లాలో 73 సర్పంచ్ స్థానాలకు 245 మంది, మహబూబాబాద్ జిల్లాలో 143 సర్పంచ్ స్థానాలకు 460 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
Also Read: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. టెన్త్, ఇంటర్‌కు ఒకటే బోర్డ్
ఓటర్లు కూడా తమ గ్రామ భవిష్యత్తును నిర్ణయించే నాయకుడిని ఎన్నుకునే బాధ్యతతో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు పూర్తయ్యి, గ్రామస్థాయిలో బలమైన ప్రజాస్వామ్యం మరింత పటిష్టం కావాలని అధికారులు, ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.