Tourism Scam: స్వేచ్ఛ బ్యూరో: టూరిజం శాఖలో కింది స్థాయి అధికారులు, సిబ్బందిపై పర్యవేక్షణ కొరవడింది. శాఖ విజిలెన్స్ సైతం పటిష్టంగా లేకపోవడం, శాఖకు ఈడీ సైతం లేకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. శాఖకు ఆదాయం వచ్చే బోట్లటికెట్లు, ఇంధనం పేరుతో చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సాగర్ లో ఓ అధికారి ఏకంగా ఎంఆర్ టికెట్ల బుకింగ్ పుస్తకమే ముద్రించినట్లు సమాచారం. అంటే ఏమేరకు ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉందనేది స్పష్టమవుతుంది. శాఖ నుంచి వేతనాలు తీసుకుంటూనే శాఖకే కన్నం వేస్తుండటం ఇప్పుడు చర్చకు దారితీసింది.
పర్యాటకశాఖ బలోపేతంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో మంత్రి జూపల్లి కృష్ణారావు అభివృద్ధిపై దృష్టిసారించారు. ఒకవైపు పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతులతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకోవైపు ఏకో టూరిజం, కేంద్రం నిధులు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు ఇలా ముందుకు సాగుతున్నారు. అయితే అధికారులు మాత్రం శాఖకు కన్నం వేస్తున్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండిపెడుతున్నారు. అక్రమమార్గంలో నిధులు కాజేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. టూరిజం ప్రాంతాల్లోని నదులు, సరస్సులు, చెరువుల్లో టూరిజం శాఖ బోట్లను నడుపుతుంది. దీంతో పర్యాటకశాఖకు ఆదాయం సైతం వస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 27 ప్రాంతాల్లో 99బోట్లు నడుస్తున్నాయి.
హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్, దుర్గం చెరువు, మిరాలం చెరువు, సరూర్ నగర్ చెరువు, మిర్యాలగూడ పందిళ్లపల్లి, నాగార్జునసాగర్, సూర్యాపేటలోనిసద్దుల చెరువు, భువనగిరిలోని రాయిగిరి చెరువు, ఖమ్మంలో లకారం చెరువు, మదిర, కొత్తగూడెంలోని కిన్నెరసాని, ములుగులోని లక్నవరం చెరువు, కరీంనగర్ లోని ఎల్ఎండీ కరీంనగర్, జగిత్యాలలోని కోటిలింగాల, సిద్దిపేటలోని కోమటిచెరువు, జయశంకర్ భూపాలపల్లిలోని రామప్పసరస్సు, నిజామాబాద్ లోని అలీసాగర్, నిర్మల్ లోని కడెం ప్రాజెక్టు, గద్వాలలోనిజమ్ములమ్మ, మహబూబ్ నగర్ లోని కోయిల్ సాగర్, నాగర్ కర్నూల్ లోని ఈగలపెంట, కేసారిసముద్రం, సింగోతమ్, సోమశీల, జొన్నలబొగడ(బ్యాలెన్సింగ్ రివర్), వికారాబాద్ లోని లక్నపూర్ లేక్, సిరిసిల్లలోని వార్దవల్లి(బ్యాక్ వాటర్ ఆప్ ఎంఎండీ). అయితే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. కానీ ఆదాయం మాత్రం తగ్గుతుండటం ఇప్పుడు చర్చకు దారితీసింది. 2024లో బోట్లతో పర్యాటకకు 14.60కోట్లఆదాయం వచ్చింది. 2025లో మాత్రం 13.12కోట్ల ఆదాయం మాత్రమే రావడం ఇప్పుడు విమర్శలకు దారితీస్తుంది. అంటే 1.48కోట్ల ఆదాయం ఎందుకు తగ్గిందనే చర్చ శాఖలోనే జరుగుతుంది. రోజూరోజుకు విదేశీ, స్వదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. కానీ ఆదాయం పెరగాల్సి ఉండగా ఏడాదిలోనే సుమారు కోటిన్నర ఆదాయం తగ్గడం ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఏమేరకు ఉందనేది స్పష్టమవుతోంది.
Also Read: Chiranjeevi: చిరంజీవి గొప్ప మనసు..ఆ అవార్డు డబ్బులు మొత్తం విరాళంగా ఇచ్చిన మెగాస్టార్!
రాష్ట్రంలో ప్రస్తుతం క్రూయిజ్ బోట్లు 6, అమెరికన్ పాన్ టూన్ బోట్లు 4, మైకనైజ్డ్ బోట్లు 5, పాటూన్ బోట్లు19, డీలక్స్ బోట్లు 9, స్పీడ్ బోట్లు 35, పెడల్ బోట్లు 21 ఉన్నాయి. అయితే ఈ బూట్ల ఇన్ చార్జులులేక మేనేజర్లుగా ఉన్నవారు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. స్పీడ్ బోటు లో ప్రయాణానికి ఒక్కరికి రూ.500లు ఉంటుంది. ఇతర బోట్లలో ఒక్కరికి 200లకు పైగా ఉంటుంది. అయితే ఇన్ చార్జులు కొంతమంది సిబ్బందితో కుమ్మక్కై టికెట్లు లేకుండానే ప్రయాణానికి అనుమతి ఇస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ప్రతి రోజూ వందమంది పర్యాటకులు బోట్లలో ప్రయాణం చేస్తే 30 నుంచి 40మందికి డబ్బులు తీసుకొని టికెట్లు ఇవ్వకుండా అనుమతి ఇస్తున్నారనే ప్రచారంజరుగుతుంది. ఏళ్ల తరబడి బోటింగ్ కౌంటర్లో సిబ్బంది పనిచేస్తుండటం, మూడేళ్లకు ఒకసారి బదిలీ చేయాల్సి ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు కొనసాగిస్తుండటం వల్లనే అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హుస్సేన్ సాగర్, దుర్గం చెరువు, మిరాలం చెరువు, సరూర్ నగర్ చెరువు ల వద్ద బోటింగ్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది ఏళ్ల తరబడి ఒకే దగ్గర పనిచేస్తున్నట్లు సమాచారం.
బోట్లుడీజిల్ తో నడుస్తాయి. అయితే స్పీడ్ బూట్లు,పెద్దబోట్లు, క్రయిజ్ బూట్లకు ఒక ట్రిప్పునకు2 లేదా 3 లీటర్లు అయితే మరో రెండు లీటర్లు అదనంగా బిల్లులు పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం, కింది స్థాయి అధికారులు సైతం చూసిచూడనట్లు వ్యవహరిస్తుండటంతో పర్యాటకశాఖ ఆదాయానికి గండిపడుతుంది. 10 ట్రిపులు స్పీడ్ బూట్లు తిరిగితే..6ట్రిపులు రాస్తున్నండటం మిగిలిన 4 ట్రిప్పులకు వచ్చే ఆదాయాన్ని సంబంధిత బోట్లఇన్చార్జులు కాజేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి తోడు బోట్లకుమరమ్మతుల పేరుతో లక్షల్లో డ్రాచేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఏదైనా చిన్న రిపేరు వచ్చినా.. దానిని చేయించడంతో పాటు ఎంటీ బిల్లులు తీసుకొచ్చి మరీ టూరిజం ఆదాయానికి గండి కొడుతున్నారనే విమర్శలు ఊపందుకున్నాయి.
Also Read: Minister Jupally: మంత్రి జూపల్లి కృష్ణారావుకి దక్కిన అరుదైన గౌరవం.. అవార్డు అందజేత..?
నాగార్జున సాగర్ లో పనిచేసిన ఓ బోటింగ్ ఇన్చార్జీ ఏకంగా ఎంఆర్ టికెట్ల బుకింగ్ బుక్ ను ముద్రించినట్లు సమాచారం. ఓ వ్యక్తి ఫిర్యాదుతో టూరిజం ఎన్ ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేసి ఆ ఎంఆర్ టికెట్ల బుకింగ్ బుక్ ను స్వాధినం చేసుకున్నట్లు సమాచారం. అంటే ప్రభుత్వానికి లెక్కలు చూపించాల్సిన అధికారులే.. ఆదాయం తీసుకున్నరావల్సిన వారు శాఖ నిధులకే కన్నం వేస్తుండటం గమనార్హం. ఎవరైనా పార్టీలకు గానీ, సరదాగా పర్యటించేందుకు టికెట్ల బుకింగ్ చేసుకుంటారు. వారికి ప్రభుత్వం ముద్రించిన ఎంఆర్ బుక్ లో నమోదు చేసి వారికి అందుకు సంబంధించిన రషీదు ఇస్తారు. అయితే అదేస్ధాయిలో నకిలీ బుక్ ను తయారు చేసి మరీ నిధులు కాజేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు బోటింగ్ టికెట్స్ కు.. సాగర్ మ్యూజియం టికెట్లకు మధ్య తేడా సైతం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. దీంతో ఆ బోటింగ్ ఇన్ చార్జి స్థానంలో మరొకరికి తాత్కాలిక ఇన్ చార్జీ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.
నిత్యం ఉద్యోగుల పని విధానాలపై, పారదర్శకత కోసం శాఖ ఎన్ ఫోర్స్ మెంట్ నిఘా పెట్టాల్సి ఉంది. కానీ ఆ ఎన్ ఫోర్స్ మెంట్ కు సిబ్బంది లేకపోవడంపై అధికారులపై మానిటరింగ్ చేయడం లేదని సమాచారం. దీంతో కింది స్థాయి ఉద్యోగులు, సిబ్బంది విధుల్లో అలసత్వం, శాఖ ఆదాయానికి గండి కొడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు శాఖకు ఈడీ సైతం లేకపోవడంతో ఉద్యోగులు సైతం విధుల్లో కొంత నిర్లిప్తంగా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికైనా శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందిపై నిఘాపెట్టాలని, బోటింగ్ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి ఒకే దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులను, సిబ్బందిని సైతం బదిలీ చేయాలని, బోట్లపై అవగాహన ఉన్నవారికే ఇన్ చార్జీ బాధ్యతలు అప్పగించాలని పలువురు కోరుతున్నారు.శాఖ ఆదాయం పెరగాలంటే ఓకే చోట్ల ఏళ్లుగా పనిచేస్తున్నవారిని బదిలీచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? శాఖ మంత్రి సైతం జోక్యం చేసుకుంటారా? శాఖను గాడిలో పెడతారా? లేదా? అనేది చూడాలి.
Also Read: Railway Dispute: పునర్వి విభజన చట్టానికి తూట్లు.. ఓరుగల్లులో రైల్వే ఖజానాకు భారీగా గండి..!